‘ల్యాండ్ ఫర్ జాబ్’ కుంభకోణం.. తేజస్వీ యాదవ్ అరెస్టుకు రంగం సిద్ధం?

  • రేపో, మాపో తేజస్వీ యాదవ్‌కు నోటీసులు
  • మొత్తం 1,458 మందికి అడ్డదారిలో ఉద్యోగాలు ఇచ్చినట్టు అభియోగాలు
  • లాలుప్రసాద్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కుంభకోణం
  • తేజస్వీనే జాబితా తయారు చేసినట్టు గుర్తించిన సీబీఐ
‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అరెస్ట్‌కు సీబీఐ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఇక అరెస్టులకు తెరతీయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ కుంభకోణంలో భాగంగా మొత్తం 1,458 మంది అభ్యర్థులకు ముంబై, జబల్‌పూర్‌, కోల్‌కతా, జైపూర్‌, హాజీపూర్‌ రైల్వే జోన్లలో గ్రూప్‌-డి కొలువులు ఇప్పించినట్లు అనుమానిస్తున్నారు. 

ఈ జాబితాను తేజస్వీ యాదవ్ తయారుచేసినట్టు సీబీఐ గుర్తించింది. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలు పొందిన 16 మందిని విచారించామని, మిగతా 1,442 మందిని విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. 

కాగా, ఈ కుంభకోణం యూపీఏ-1 హయాంలో 2004-09 మధ్య జరిగింది. అప్పట్లో రైల్వేశాఖ మంత్రిగా ఉన్న లాలుప్రసాద్ యాదవ్ గ్రూప్-డి రైల్వే ఉద్యోగుల నియామకాల్లో అక్రమాలకు తెరలేపినట్టు సీబీఐ వాదిస్తోంది. కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో భూములు తమ పేర రాయించుకుని కొలువులు ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 18న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లాలు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఓఎస్డీగా పనిచేసిన భోలా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.


More Telugu News