టాప్‌లో పాల్వాయి స్ర‌వంతి... మునుగోడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎంపిక ఖాయ‌మే!

  • 2014 ఎన్నికల్లో మునుగోడు అభ్య‌ర్థిగా స్ర‌వంతి పోటీ
  • 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి కోసం టికెట్ వ‌దులుకున్న స్ర‌వంతి
  • తాజా స‌ర్వేలో అంద‌రికంటే అధిక మార్కులు సాధించిన వైనం
  • ఏఐసీసీకి చేరిన స‌ర్వే నివేదిక‌
అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతున్న న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌కు సంబంధించి అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ భారీ క‌స‌ర‌త్తే చేస్తోంది. ఇప్ప‌టికే టికెట్‌ను ఆశిస్తున్న న‌లుగురు నేత‌ల‌కు సంబంధించిన నియోజ‌క‌వ‌ర్గ స‌ర్వే నివేదికను టీపీసీసీ సోష‌ల్ మీడియా ఇంచార్జీ సునీల్ బృందం గురువారం టీపీసీసీ పెద్ద‌ల‌కు అంద‌జేసింది. దీనిని టీపీసీసీ పెద్ద‌లు గురువార‌మే ఏఐసీసీకి పంపారు. నివేదికను బట్టి పార్టీ అధిష్ఠాన‌మే అభ్య‌ర్థిని ఖరారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉంటే... మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ను ఆశిస్తున్న వారు న‌లుగురు నేత‌లున్నా... మాజీ మంత్రి పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతి స‌ర్వేలో టాప్‌లో నిలిచిన‌ట్లు స‌మాచారం. పాల్వాయికి వ‌చ్చినంత మేర ఓట్లు చ‌ల్లా కృష్ణారెడ్డికి కూడా వ‌చ్చినా... స్ర‌వంతి ముందు ఆయ‌న తేలిపోయిన‌ట్లుగా స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు అభ్య‌ర్థిగా పోటీ చేసిన స్ర‌వంతి ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2018 ఎన్నిక‌ల్లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు టికెట్ ఆశించ‌డంతో స్ర‌వంతి స్వ‌చ్ఛందంగానే పోటీ నుంచి త‌ప్పుకున్నారు. కోమ‌టిరెడ్డి గెలుపు కోసం ప‌నిచేశారు. ఈ ప‌రిణామ‌మే స‌ర్వేలో పాల్వాయి స్ర‌వంతికి క‌లిసివ‌చ్చిన‌ట్లు స‌మాచారం.


More Telugu News