‘పోర్న్’ కేసులో నేను బలి పశువుని: కోర్టు ముందు రాజ్ కుంద్రా వాదన
- పోర్న్ కంటెంట్ తయారీ, పంపిణీ కార్యకలాపాల్లో పాల్గొనలేదంటూ రాజ్ కుంద్రా పిటిషన్
- ఏ ఒక్క మహిళ కూడా తనకు వ్యతిరేకంగా చెప్పలేదని వాదన
- దర్యాప్తు సంస్థ ఏ ఒక్క ఆధారాన్నీ సంపాదించలేదని వ్యాఖ్య
ప్రముఖ వ్యాపారి, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తనకు ఏ పాత్ర లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. నటన కోసం వచ్చే యువతులతో ఆయన పోర్న్ వీడియోలు చిత్రీకరించి వ్యాపారం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనపై మోపిన ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఆయన మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.
ఫిర్యాదు ఆధారంగా ఇప్పటి వరకు కొనసాగిన దర్యాప్తును గమనిస్తే.. తాను ఎటువంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనలేదని, రహస్యంగా ఎటువంటి కంటెంట్ ను సృష్టించలేదని అడ్వొకేట్ ప్రశాంత్ పాటిల్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ లో రాజ్ కుంద్రా పేర్కొన్నారు. ఎటువంటి కంటెంట్ అప్ లోడ్, ప్రసారం చేసే కార్యకలాపాల్లో పాల్గొనలేదని కోర్టుకు తెలిపాడు.
చార్జ్ షీటులో కానీ, సప్లిమెంటరీ చార్జ్ షీటులోకానీ ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించినట్టు, బలవంతం పెట్టినట్టు, వీడియో తీసినట్టు చెప్పలేదని గుర్తు చేశారు. పోర్న్ కంటెంట్ అప్ లోడ్ లేదా విక్రయంలో పాల్గొనలేదని నివేదించారు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీటు పేర్కొంది. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్నీ సంపాదించలేకపోయినట్టు గుర్తు చేశారు.