కోహ్లీని అలా చూసి షాకయ్యా అంటున్న ఆఫ్ఘన్​ స్పిన్నర్ రషీద్ ఖాన్

  • గతే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడిన రషీద్
  • తమ జట్టుతో మ్యాచ్ కు ముందు కోహ్లీ ప్రాక్టీస్ చూశానన్న స్పిన్నర్
  • నెట్స్ లో  రెండున్నర గంటలు బ్యాటింగ్ చేయడంతో ఆశ్చర్యపోయానని వెల్లడి
ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ గుర్తుచేసుకున్నాడు . నెట్స్‌లో దాదాపు రెండున్నర గంటల పాటు భారత స్టార్ ప్రాక్టీస్‌ను చూసి తాను షాక్ అయ్యానని చెప్పాడు. రషీద్ గత ఐపీఎల్ సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. ఆ జట్టు టైటిల్ నెగ్గడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ గురించి ఒక సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. 

‘ఐపీఎల్ సమయంలో మేము మరుసటి రోజు ఆర్ సీబీతో మ్యాచ్ కోసం సన్నద్ధం అవుతున్నాం. అదే సమయంలో ఈ పోరు కోసం కోహ్లీ కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను సరదాగా తను నెట్స్‌లో ఉన్న సమయాన్ని లెక్కించా. నిజం చెప్పాలంటే, అతను రెండున్నర గంటల పాటు బ్యాటింగ్ చేయడం చూసి నేను షాకయ్యా. ఎందుకంటే మా నెట్‌ సెషన్ మొత్తం పూర్తయింది. అయినప్పటికీ, అతను బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు, తను మాపై దాదాపు 70 పరుగులు చేశాడు. కోహ్లీ ఆలోచనా విధానం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది’ అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ పెద్దగా రాణించడం లేదు. అయితే, కోహ్లీ ఆడే షాట్లు చూస్తుంటే అతను ఫామ్‌లో లేనట్లు కనిపించడం లేదని ఖాన్ భావిస్తున్నాడు. ‘కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, తను అద్భుతమైన షాట్లు ఆడేవాడు. అవి చూస్తుంటే అతను ఫామ్ లో లేనట్టు అస్సలు అనిపించదు. కోహ్లీపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాతి మ్యాచ్ లో తను సెంచరీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ మధ్య అతని టెస్ట్ ఇన్నింగ్స్‌ లను పరిశీలిస్తే తన బ్యాటింగ్‌లో కష్టతరమైన సమయాన్ని అధిగమించాడు. ఎలాగోలా 50, 60, 70 స్కోర్లు చేసి ఔటయ్యాడు. మరే ప్లేయర్ అయినా ఇలాంటి స్కోర్లు చేస్తే అతను ఫామ్‌లోనే ఉన్నారని చెప్పేవారు. కానీ విరాట్‌పై అంచనాలు ఎక్కువ. తన నుంచి అంతా సెంచరీలే ఆశిస్తుంటారు’ అని రషీద్ చెప్పుకొచ్చాడు.


More Telugu News