ఈసీ సంచలన నిర్ణయం.. ఝార్ఖండ్ సీఎం సోరెన్ అనర్హతకు సిఫారసు

  • దీనిపై గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి
  • సీఎం సోరెన్ పేరిట మైనింగ్ లీజు
  • ఇది వ్యక్తిగత కార్యాలయ ప్రయోజనం కిందకు వస్తుందన్న బీజేపీ
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల కమిషన్ ఝార్ఖండ్ గవర్నర్ కు సిఫారసు చేసింది. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా సోమవారం నుంచి ఢిల్లీలో ఉండగా, గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నట్టు ఓ అధికారి తెలిపారు. గవర్నర్ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

‘‘ఎన్నికల కమిషన్ సోరెన్ ను అసెంబ్లీ నుంచి అనర్హుడిగా ప్రకటించాలని సిఫారసు చేసింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది గవర్నర్ పైనే ఆధారపడి ఉంటుంది’’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర సీఎంగా సోరెన్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడమే దీనికి మూలంగా ఉంది. సీఎం తన పేరిట స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును కలిగి ఉన్నందున ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ (కార్యాలయ ప్రయోజనం) కింద సీఎంగా అనర్హుడని బీజేపీ ఫిర్యాదు చేసింది. 

బీజేపీ, సోరెన్ తరఫున న్యాయవాదుల వాదనలను ఎన్నికల కమిషన్ బెంచ్ విన్న తర్వాత ఈ సిఫారసు చేసింది. మాజీ సీఎం రఘుబార్ దాస్ ఆధ్వర్యంలోని బీజేపీ బృందం ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం.


More Telugu News