బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలపై కేంద్రం, గుజరాత్​కు సుప్రీంకోర్టు నోటీసులు

  • దోషుల విడుదలను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం
  • అన్నీ ఆలోచించే వారికి క్షమాభిక్ష ఇచ్చారా? అని తెలుసుకోవాలన్న న్యాయస్థానం
  • రిమిషన్ పాలసీ ప్రకారం విడుదల చేయడం సమర్థనీయమా? అన్నదే అసలు ప్రశ్న అన్న జస్టిస్ రస్తోగి
బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషుల విడుదలపై సుప్రీంకోర్టు కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాపణలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా, మహిళా హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అంగీకరించింది. 

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం-హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష మంజూరు చేసేటప్పుడు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? లేదో? తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్లను విచారిస్తున్నప్పుడు, జస్టిస్ రస్తోగి మాట్లాడుతూ ‘ఏ చర్యలు జరిగినా, వాళ్లు దోషులుగా నిర్ధారించబడ్డారు. అయితే, రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడం సమర్థనీయమా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న’ అని అన్నారు. సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. క్షమాభిక్ష కోసం అప్లికేషన్ మాత్రమే దాఖలు చేయవచ్చని కోర్టు ఆదేశింస్తే.. దోషుల విడుదలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందని ప్రచారం జరుగుతోందన్నారు. 

ఈ అంశాన్ని చట్టానికి లోబడి పరిగణించాలని మాత్రమే సుప్రీంకోర్టు కోరిందని జస్టిస్ రస్తోగి అన్నారు. అలాగే, ఈ కేసులో విడుదలైన దోషులందరినీ ఒక పార్టీ సభ్యులుగా చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దోషులకు వ్యతిరేకంగా ప్రతికూల ఉత్తర్వులు కోరినప్పుడు కూడా వారిని పార్టీలుగా మార్చలేదని న్యాయవాది కోర్టుకు చెప్పడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, గుజరాత్ 1992 రిమిషన్ పాలసీ ప్రకారం దోషుల్లో ఒకరి రిమిషన్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని మేలో ఆదేశించిన ధర్మాసనానికి జస్టిస్ రస్తోగి నేతృత్వం వహించడం గమనార్హం. 



More Telugu News