ప్రాక్టీస్​లో సిక్సర్లతో దుమ్మురేపుతూ.. ఆసియా కప్​ కు రెడీ అవుతున్న విరాట్​ కోహ్లీ

  • ఆసియా కప్ కోసం బుధవారం తొలి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న టీమిండియా 
  • నెట్స్ లో స్పిన్నర్లు అశ్విన్, చహల్ ను ఎదుర్కొన్న విరాట్
  • ఇద్దరి బౌలింగ్ లో భారీ షాట్లు ప్రాక్టీస్ చేసిన కోహ్లీ
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహకాలు మొదలు పెట్టింది. యూఏఈ వేదికగా శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది. భారత్- పాక్ మ్యాచ్ అంటే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. గతేడాది ఇదే యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. 

ఇక, వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ తోనే తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్ లో లేని విరాట్ ఈ పోరులో సత్తా చాటి తిరిగి గాడిలో పడాలని చూస్తున్నాడు. ఆసియా కప్ కోసం భారత జట్టు బుధవారం మొదటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా.. విరాట్ కోహ్లీ నెట్స్ లో చెమటలు చిందించాడు. యూఏఈ పిచ్ లు స్పిన్నర్లకు సహకరిస్తాయి కాబట్టి తొలి సెషన్ లోనే కోహ్లీ స్పిన్ బౌలింగ్ లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. నెట్స్ లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. ఇద్దరి బౌలింగ్ లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. కొన్ని బాల్స్ సరిగ్గా కనెక్ట్ అవ్వనప్పుడు తను నవ్వుతూ కనిపించాడు.  

ఇక, ఈ ప్రాక్టీస్ సెషన్ కు ముందు ఇదే గ్రౌండ్ లో వామప్ ముగించుకుని వెళ్తున్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను కోహ్లీ ఆప్యాయంగా పలకరించాడు. అతనితో కరచాలనం చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే గ్రౌండ్ లో ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ను కూడా కోహ్లీ పలకరించాడు.


More Telugu News