మగాళ్లయితే ఇప్పుడు రండి.. దమ్ముంటే జగన్, డీజీపీ కూడా రావొచ్చు: చంద్రబాబు సవాల్

  • చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత
  • టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే ఇంటికొచ్చి కొడతానని చంద్రబాబు హెచ్చరిక
  • కుప్పం చరిత్రలో ఇది చీకటి రోజు అని వ్యాఖ్య
  • రౌడీలను మంత్రులను చేసిన ఘనత  జగన్ దని మండిపాటు
  • అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వారి ముఖాన ఉమ్మేయాలని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నిస్తున్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగిస్తూ.... ముఖ్యమంత్రి జగన్ పై, వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. దమ్ముంటే, మగాళ్లయితే ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే సీఎం జగన్, డీజీపీ వచ్చినా సరే అని ఛాలెంజ్ చేశారు. జగన్ కు దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్నారు. జగన్ రెడ్డి చేతిలో పోలీసులు కీలు బొమ్మలుగా మారారని మండిపడ్డారు. కుప్పం చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు. ఇలాంటి దారుణాలు కుప్పంలో గతంలో ఎప్పుడూ జరగలేదని చెప్పారు. 

పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గూండాలు, రౌడీలను అణచి వేసిన చరిత్ర టీడీపీదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వీధికొక రౌడీని తయారు చేసిందని అన్నారు. రౌడీలను మంత్రులను చేసిన ఘనత జగన్ దని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపై టీడీపీ వాళ్లను ఎవరైనా కొడితే నేరుగా వాళ్లింటికి వస్తానని హెచ్చరించారు. ఇంటికొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాను బతికున్నంత వరకు ఏమీ చేయలేరని చెప్పారు. ధర్మపోరాటాన్ని తాను కుప్పం నుంచే ప్రారంభిస్తున్నానని చెప్పారు. జగన్ పాలనపై రాష్ట వ్యాప్తంగా వ్యతిరేకత, తిరుగుబాటు మొదలయిందని అన్నారు.  

అంతకు ముందు కుప్పంలో అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయాలని వీరికి ఎలా అనిపించిందని మండిపడ్డారు. వీరి ముఖాన ఉమ్మేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు అన్నం పెట్టరు, పెట్టేవాళ్లను పెట్టనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News