ప్రయాణికుల మనసులను గెలిచిన విమానం పైలట్

  • పంజాబీ భాషలోనూ అనౌన్స్ మెంట్
  • ప్రయాణికులకు పలు సూచనలు
  • విండో సీట్ లో ఉన్న వారు ఫొటోగ్రఫీ నైపుణ్యాలు చూపించొచ్చని పిలుపు
ఇండిగో పైలట్ ఒకరు తన ప్రత్యేక తీరుతో ప్రయాణికులను మెప్పించాడు. బెంగళూరు నుంచి చండీగఢ్ వెళ్లే విమానంలో ఇంగ్లిష్ తో పాటు, పంజాబీ భాషలో అనౌన్స్ మెంట్ ఇవ్వడం ఎక్కువ మందిని ఆకర్షించింది. సాధారణంగా విమానాల్లో ఇంగ్లిష్, హిందీలోనే సూచనలు ఇస్తుంటారు. 

అయితే, మైక్రోఫోన్ పట్టుకుని ప్రయాణికులకు సూచనలు, టిప్స్ కూడా ఇవ్వడం ఆకర్షించింది. ‘‘ఎడమ వైపు కూర్చున్న వారు తమ ఫొటోగ్రఫీ నైపుణ్యాలను చూపించొచ్చు. కుడివైపు కూర్చున్న వారు భోపాల్ చూడొచ్చు. ఇక మధ్యలో కూర్చున్న వారు ఒకరినొకరు చూసుకోవడం తప్ప చేసేదేమీ లేదు’’ అంటూ నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు. అందుకే విండో సీట్ తీసుకోవాలని సూచించాడు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, మాస్క్ ధరించాలని కోరాడు. 

ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే తొందరపాటు ప్రదర్శించొద్దని కోరాడు. ‘‘డోర్స్ తెరుచుకునే వరకు మీ సీట్లలోనే కూర్చోండి. మీ లగేజీ పూర్తి సురక్షితంగా ఉంది’’ అంటూ భరోసా ఇచ్చాడు. ఇలాంటి పైలట్ ను చూడడం ఇదే మొదటిసారి అంటూ పలువురు ప్రయాణికులు ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. 



More Telugu News