భారత్‌పై దాడిచేసేందుకు రూ. 30 వేలు ఇచ్చి పంపారు: పట్టుబడిన ఉగ్రవాది వెల్లడి

  • 48 గంటల్లో మూడు చొరబాటు యత్నాలను అడ్డుకున్న భారత సైన్యం
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న వైనం
  • పాక్ కల్నల్ ఒకరు తనకు డబ్బులిచ్చి పంపారని వెల్లడి
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేర సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద ఇండియన్ ఆర్మీకి చిక్కిన ఉగ్రవాది సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఇక్కడ గత 48 గంటల్లో రెండు చొరబాటు యత్నాలను అడ్డుకున్న భారత సైన్యం.. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. మరో ఇద్దరు ఉగ్రవాదులు మందుపాతర పేలుడులో మరణించారు.  ఈ నెల 21న తెల్లవారుజామున నౌషేరాలోని ఝంగర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను సైన్యం గుర్తించింది.

ఓ ఉగ్రవాది ఇండియన్ పోస్టు వద్దకు వచ్చి ఫెన్సింగును కట్ చేసేందుకు ప్రయత్నించాడు. సైన్యం గుర్తించి అప్రమత్తం కావడంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన సైన్యం గాయపడిన ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. అతడి వెనకే నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో ల్యాండ్‌మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు.

సజీవంగా పట్టుకున్న ఉగ్రవాదికి తక్షణం వైద్య సాయం అందించడమే కాకుండా సర్జరీ కూడా చేసి అతడి ప్రాణాలను రక్షించారు. అతడిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోట్లీ జిల్లా సబ్జ్‌కోట్ ప్రాంతానికి చెందిన తబారక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ సందర్భంగా అతడిని విచారించగా కీలక విషయాన్ని వెల్లడించాడు. ఇండియన్ ఆర్మీ పోస్టుపై దాడికి పథకం రచించినట్టు చెప్పాడు.

 పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనుస్ చౌధరి ఇండియన్ ఆర్మీపై దాడి చేయాలని తనకు 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చి పంపినట్టు చెప్పాడు. సరైన సమయంలో ఇండియన్ ఆర్మీ పోస్టులపై దాడి జరిపేందుకు ఇతర ఉగ్రవాదులతో కలిసి రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించేందుకు కూడా తీసుకెళ్లినట్టు చెప్పాడు. తమ ప్లాన్స్ గురించి తబారక్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


More Telugu News