స్కూలుకెళ్లే బాధ తప్పుతుందని.. 8వ తరగతి చదువుతున్న బాలుడిని చంపేసిన పదో తరగతి విద్యార్థి

  • బడికి వెళ్లడం ఇష్టం లేకున్నా బలవంతంగా స్కూలుకు పంపుతున్న తల్లిదండ్రులు
  • బడి బాధను తప్పించుకునేందుకు హత్య చేయాలని పథకం
  • తన జూనియర్‌ను ఆడుకునేందుకు పిలిచి గొంతుకోసి హత్య
  • ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం
పిల్లల ఆలోచనలు ఎంత విక‌ృతంగా మారిపోతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన అతిపెద్ద ఉదాహరణ. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేని విద్యార్థి.. బడి బాధను పూర్తిగా తప్పించుకునేందుకు ఒళ్లు జలదరించే ప్లాన్ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నీరజ్ కుమార్ (13)ను గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పి తనను జైలుకు పంపాలని కోరాడు. బాలుడు చెప్పింది విని విస్తుపోయిన పోలీసులు తొలుత అతడి మాటలు విశ్వసించకున్నా.. ఆ తర్వాత అతడు చెప్పిన ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేలో ఓ ప్రదేశానికి వెళ్లి చూసి షాకయ్యారు. అక్కడ నీరజ్ కుమార్ మృతదేహం కనిపించింది. దీంతో నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. నిందితుడు, బాధితుడు ఇద్దరూ ఇరుగుపొరుగు వారే. ఆడుకునేందుకు వెళ్దామంటూ నీరజ్ కుమార్‌ను తీసుకెళ్లిన నిందిత బాలుడు అనంతరం నీరజ్ గొంతుకోసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. రక్తపు మడుగులో పడివున్న బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

చదువు కోవడం తనకు ఇష్టం లేదని, విషయం చెప్పినా తల్లిదండ్రులు తనను బలవంతంగా బడికి పంపుతున్నారన్న బాలుడు.. హత్య చేసి జైలుకు వెళ్తే చదువు కోవాల్సిన పని ఉండదన్న ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News