రైతులను శునకాలతో పోల్చిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా.. వీడియో వెలుగులోకి

  • రాకేశ్ టికాయత్‌ను బి గ్రేడ్ వ్యక్తిగా అభివర్ణించిన కేంద్రమంత్రి
  • అలాంటి వ్యక్తి మాటలకు విలువ ఉండదన్న అజయ్ మిశ్రా
  • కుమారుడు జైలుకు వెళ్లిన బాధలో మాట్లాడి ఉంటారన్న రాకేశ్ టికాయత్
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రైతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన తన సహచరులతో మాట్లాడుతూ రైతులను శునకాలతో పోల్చారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సారథి రాకేశ్ టికాయత్‌తో లఖింపూర్‌లో ఆందోళన చేసిన రైతులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆ వీడియోలో ఆయన తన సహచరులతో మాట్లాడుతూ.. తాను కారులో వేగంగా వెళ్లినప్పుడు శునకాలు అరవడమో, వెంటపడడమో చేస్తాయని, అలా చేయడం వాటి అలవాటని అన్నారు. తమకు మాత్రం అలాంటి అలవాటు లేదన్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడబోనన్నారు. ఆ అంశం తన ముందుకు వచ్చినప్పుడు సమాధానం ఇస్తానని, తన ధైర్యానికి మీ మద్దతే కారణమంటూ ఆయన వారితో చెప్పుకొచ్చారు. 

అలాగే, రాకేశ్ టికాయత్ గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి తనకు తెలుసని, ఆయనొక బి గ్రేడ్ వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయిన అలాంటి వ్యక్తి వ్యాఖ్యలకు విలువ ఉండదన్నారు. అలాంటి వాడు అడిగే ప్రశ్నలకు తాను బదులివ్వనని తెగేసి చెప్పారు. కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై రాకేశ్ టికాయత్ స్పందించారు. ఆయన కుమారుడు జైలుకు వెళ్లిన బాధలో ఉండడంతోనే ఆయనలా మాట్లాడి ఉంటారని అన్నారు. 

కాగా, గతేడాది అక్టోబరులో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోగా, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు చనిపోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.


More Telugu News