సూర్యుడి గుట్టుమట్లు విప్పేందుకు... టిబెట్ పీఠభూమిలో చైనా టెలిస్కోప్ వలయం

  • అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేసిన చైనా
  • 313 డిష్ లతో రేడియో టెలిస్కోపిక్ అర్రే ఏర్పాటు
  • ఊపందుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద సర్క్యులర్ టెలిస్కోప్ పనులు
ఇటీవల కాలంలో చైనా అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేసింది. అంగారకుడు, ఆస్టరాయిడ్లు, సుదూర గ్రహాల సంగతులు తెలుసుకునేందుకు అనేక యాత్రలకు రూపకల్పన చేస్తోంది. తాజాగా, సూర్యుడి గుట్టుమట్లు విప్పి చెప్పేందుకు ఒక బృహత్ కార్యక్రమం చేపట్టింది. అందుకోసం టిబెట్ పీఠభూమిలో రేడియో టెలిస్కోప్ ల వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. 

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సర్క్యులర్ రేడియో టెలిస్కోప్. దీని పేరు దావోచెంగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ (డీఎస్సార్టీ). ప్రస్తుతం టిబెట్ పీఠభూమిలో డీఎస్సార్టీకి చెందిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తిగా నిర్మాణం జరుపుకున్న తర్వాత 6 మీటర్ల నిడివి గల 313 టెలిస్కోపిక్ డిష్ లు సూర్యుడిపై అధ్యయనం ప్రారంభిస్తాయి. ఈ వందలాది డిష్ లతో కూడిన వ్యవస్థ సూర్యుడిలోని కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) వ్యవస్థల లోతులను పరిశోధిస్తుంది. 

సీఎంఈ అంటే... ఓ నక్షత్రం నుంచి అకస్మాత్తుగా వెలువడే రేడియో ధార్మిక విస్ఫోటనం. ఇది రోదసిలోకి సుదూర ప్రాంతాలకు వ్యాపించగలదు. ఓ పెద్ద నక్షత్రమైన సూర్యుడిలోనూ ఇలాంటి సీఎంఈలు తరచుగా సంభవిస్తుంటాయి. దీని ప్రభావంతో బిలియన్ టన్నుల ద్రవ్యరాశి ఖగోళంలోకి విడుదలవుతుంది. ఇప్పుడు టిబెట్ పీఠభూమిలో ఏర్పాటు చేస్తున్న రేడియో టెలిస్కోప్ అర్రే ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ లకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


More Telugu News