బండి సంజయ్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత

  • తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు
  • జనగామ జిల్లా పామ్నూరులో బండి సంజయ్ దీక్ష భగ్నం
  • అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా పామ్నూరు వద్ద ఆయన చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు... కార్యకర్తల నినాదాలు, నిరసనల మధ్యే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ నేతలు నిన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, నిరసనకారులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ దీక్షకు దిగారు. అయితే, ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతానికి వందలాది మంది పోలీసులు చేరుకున్నారు. బలవంతంగా బండి సంజయ్ ను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. మరోవైపు మార్గ మధ్యంలో పోలీసుల వాహనాలను బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగిస్తూనే ముందుకు సాగారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. బండి సంజయ్ అరెస్ట్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు, బండి సంజయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా సంస్థలు నివేదిక అందించాయి. దీంతో, బండి సంజయ్ తో రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ సహా, కేంద్ర పెద్దలు ఫోన్ లో మాట్లాడారు. మరోవైపు ఆయనకు భద్రతను పెంచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ పోలీసుల భద్రతను ఆయన తిరస్కరించారు. తన భద్రతను బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని చెప్పారు.


More Telugu News