టీపీసీసీ చీఫ్‌ పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొల‌గించాల్సిందే: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

  • రేవంత్ కొన‌సాగితే పార్టీ చ‌చ్చిపోతుంద‌న్న‌వెంక‌ట్ రెడ్డి
  • మాణిక్కం ఠాగూర్‌ను కూడా తొల‌గించాల‌ని డిమాండ్‌
  • మునుగోడు ప్ర‌చారానికి వెళ్లబోన‌ని తేల్చి చెప్పిన వైనం
  • అయినా కూడా పార్టీని వీడేది లేద‌ని సోనియాకు తెలిపిన ఎంపీ
మునుగోడు ఉప ఎన్నిక‌కు స‌ర్వం సిద్ధ‌మ‌వుతున్న వేళ‌... అదే నియోజ‌కవ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పార్టీ అధిష్ఠానం ముందు ఓ కొత్త డిమాండ్‌ను పెట్టారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా కొన‌సాగుతున్న రేవంత్ రెడ్డిని తక్షణమే ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసేందుకు జ‌రిగిన ఏఐసీసీ స‌మావేశానికి డుమ్మా కొట్టి హైద‌రాబాద్ చేరిన త‌ర్వాత వెంక‌ట్ రెడ్డి ఈ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను ఆయ‌న పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి... టీపీసీసీకి కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించే దాకా తాను మునుగోడు ఉప ఎన్నిక‌ ప్ర‌చారానికి హాజ‌రు కాబోన‌ని తేల్చి చెప్పారు. అయితే తాను పార్టీ మారే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను కూడా ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పార్టీ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ లాంటి వాళ్ల‌ను ఠాగూర్ స్థానంలో నియ‌మించాల‌ని కోరారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ మ‌రింత కాలం కొన‌సాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చ‌చ్చిపోతుంద‌ని కూడా వెంక‌ట్ రెడ్డి పేర్కొన్నారు. అంద‌రి అభిప్రాయాల‌ను తీసుకుని కొత్త పీసీసీ చీఫ్‌ను నియ‌మించాల‌ని ఆయ‌న కోరారు.


More Telugu News