విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

  • నాడు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని విమర్శలు
  • కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్
  • ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్పష్టీకరణ
  • గతంలో ఇచ్చిన హామీలు రికార్డయ్యాయని వెల్లడి
రాష్ట్రంలోని విద్యుత్ కార్మికుల డిమాండ్లపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. నాడు విపక్ష నేత హోదాలో అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం సీఎం జగన్ మొసలి కన్నీరు కార్చారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వస్తే విద్యార్హతలు, అనుభవం, సర్వీసును పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తామని నాడు హామీ ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, కార్మికులకు, మేనేజ్ మెంట్ కు మధ్య దళారీలతో పనిలేకుండా విద్యుత్ సంస్థ నుంచే వేతనాలు ఇప్పిస్తానని కూడా మాటిచ్చారని తెలిపారు. కానీ, ఇప్పుడు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల అంశంలో సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. 

హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లోకేశ్ లేఖ రాశారు. తాను హామీ ఇవ్వలేదని చెప్పేందుకు జగన్ కు ఎలాంటి అవకాశం లేదని, గతంలో ఇచ్చిన హామీలన్నీ రికార్డయ్యాయని లోకేశ్ పేర్కొన్నారు. విపక్షనేతగా ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వారిని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికాదని హితవు పలికారు.


More Telugu News