ఏపీకి ఒకే రాజ‌ధాని ఉండాలి... అది అమ‌రావ‌తే కావాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

  • మంగ‌ళ‌గిరిలో ప‌వ‌న్‌ను క‌లిసిన రాజ‌ధాని రైతులు
  • అమ‌రావ‌తి- అర‌స‌విల్లి పాద‌యాత్ర‌కు రావాల‌ని కోరిన రైతులు
  • యాత్ర‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని చెప్పిన ప‌వ‌న్‌
ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొనసాగించాలంటూ మూడేళ్లుగా ఉద్యమం చేస్తున్న రాజ‌ధాని రైతులు సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకునేందుకు చేప‌ట్ట‌నున్న రెండో విడ‌త పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని రైతులు ఆయ‌న‌ను కోరారు. దీంతో అక్క‌డిక‌క్క‌డే స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని రైతుల ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

సెప్టెంబ‌ర్ 12 నుంచి నవంబ‌ర్ 14 వ‌ర‌కు అమ‌రావ‌తి నుంచి అర‌స‌విల్లి వ‌ర‌కు రాజ‌ధాని రైతులు రెండో విడ‌త పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్ర‌లో పాలుపంచుకోవాల‌ని రైతులు ప‌వ‌న్‌ను కోరారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప‌వ‌న్ అమ‌రావ‌తి అన్ని కులాల వారిద‌ని పేర్కొన్నారు. ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా 3 రాజ‌ధానుల పేరిట కొత్త స‌మ‌స్య‌ను సృష్టించార‌న్నారు. రాజ‌ధాని రైతుల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న ప‌వ‌న్‌.. రైతుల పాద‌యాత్ర‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌కటించారు. రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని, అది అమ‌రావ‌తే కావాల‌ని కూడా ప‌వ‌న్ చెప్పారు.


More Telugu News