అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల భేటీపై ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ స్పంద‌న ఇదే!

  • హైద‌రాబాద్‌లో జ‌రిగిన అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ
  • భేటీ రాజ‌కీయ‌మే అయ్యుండొచ్చ‌న్న ఉండ‌వ‌ల్లి
  • తెలుగు రాష్ట్రాల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను బీజేపీ వినియోగించుకోవ‌చ్చ‌ని అంచ‌నా
  • జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉంద‌న్న మాజీ ఎంపీ
బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెరలేచింది. ఈ భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నా... ఇత‌ర పార్టీలు మాత్రం రాజ‌కీయ ప్రాధాన్యం లేనిదే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా అంత తీరిక‌గా స‌మావేశ‌మ‌వుతారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సోమ‌వారం స్పందించారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా స‌మావేశం రాజ‌కీయ‌మే అయ్యుండొచ్చ‌ని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. ఒక్క తెలంగాణ‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవ‌ల‌ను వినియోగించుకునే దిశ‌గా ఈ భేటీలో చ‌ర్చ‌లు జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అన్ని అంశాల‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవ‌గాహ‌న ఉంద‌ని కూడా ఈ సంద‌ర్భంగా ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు.


More Telugu News