ఐరన్‌ లోపాన్ని అధిగమించేందుకు తోడ్పడే ఐదు అల్పాహార వంటకాలు ఇవిగో!

  • ఐరన్‌ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిపై ప్రభావం
  • దీనివల్ల రక్తహీనత సమస్య.. శరీరం బలహీనమయ్యే అవకాశం
  • గర్భిణులు, పిల్లల్లో మరిన్ని తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం
  • పలు రకాల ఆహారంతో ఐరన్‌ కొరతను తీర్చుకోవచ్చంటున్న నిపుణులు
కొన్నేళ్లుగా మనం ఇళ్లకే పరిమితం అవడం పెరిగిపోయింది. ఆహారం తీసుకునే తీరు చాలా మారింది. ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకోవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలకే పరిమితం అవడం వల్ల పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల్లో రక్త హీనత పెద్ద సమస్యగా తయారైంది. దీనికి ప్రధాన కారణం ఐరన్‌ లోపం. మానవ శరీరానికి అత్యంత కీలకమైన పోషకాల్లో ఒకటి ఐరన్‌ ఎంతో ముఖ్యమైనది. 

ఐరన్‌ లోపం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. రక్తం ద్వారా శరీరానికి రవాణా అయ్యే ఆక్సిజన్‌ శాతం తగ్గి.. బలహీనంగా తయారవుతుంది. అందువల్ల ఐరన్‌ లోపాన్ని అధిగమించడం అత్యంత అవసరం. ఈ క్రమంలో శరీరానికి తగినంత ఐరన్‌ అందడానికి వీలు కల్పించే ఐదు రకాల అల్పాహార వంటకాలను నిపుణులు సూచిస్తున్నారు. ఐరన్ లోపంతో బాధపడుతున్న వారికి ఇవి ఎంతో ప్రయోజనకరమని వివరిస్తున్నారు.

1. కాబూలీ శనగల పరాటా, రోటీలు
  కాబూలీ శనగల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని పొద్దున్నే తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబూలీ శనగల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇది మంచి జీర్ణశక్తికి కూడా తోడ్పడుతుంది. పొద్దున్నే కాబూలీ శనగలు దట్టించి చేసిన పరాటాలు, రోటీలు.. కాబూలీ శనగలు, కూరగాయలు కలిపి వండిన కర్రీతో రుచి, ఆరోగ్యం రెండూ లభిస్తాయని వివరిస్తున్నారు.

2. గుమ్మడి జ్యూస్
  గుమ్మడి కాయలు యాంటీ ఆక్సిడెంట్లకు, ఖనిజ లవణాలకు నిలయమని.. మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లక్షణాలు గుమ్మడికి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి కాయలతోపాటు గింజల్లోనూ ఐరన్ శాతం చాలా ఎక్కువ. అందువల్ల గింజలు సహా గుమ్మడి పండును జ్యూస్ చేసుకుని పొద్దున్నే అల్పాహారంతోపాటు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ జ్యూస్ చేదుగా అనిపిస్తే.. కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చని చెబుతున్నారు.

3. నువ్వులు, అవిసె గింజల జ్యూస్
  ప్రొటీన్లు, పీచు పదార్థాలు (ఫైబర్), యాంటీ ఆక్సిడెంట్లతోపాటు ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారంలో నువ్వులు, అవిసె గింజలు కీలకమైనవి. ఈ రెండింటితోపాటు కొంచెం పాలు, తేనె కలిపి మిక్సీలో చిక్కని జ్యూస్ తరహాలో చేసుకుని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

4. పాలకూర దోసెలు, రోటీలు
  పాలకూరను కర్రీలా చేసుకుని తినడం మామూలే. కానీ దానిని పొద్దున అల్పహారంలో భాగంగా చేర్చుకోవడానికి దోసెలు, రోటీల్లో కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలకూరను సన్నగా తరిగిగానీ, పేస్టులా చేసుకునిగానీ గోధుమ పిండిలో కలుపుకొని రోటీలు చేసుకోవచ్చని.. లేదా దోసెల పిండిలో పేస్టును కలుపుకొని దోసెలు వేసుకోవచ్చని వివరిస్తున్నారు. పాలకూరలో అధిక శాతంలో ఉండే ఐరన్ శరీరానికి అందుతుందని చెబుతున్నారు.

5. సోయా పోహా
  తక్కువ కేలరీలతో అధిక పోషకాలను ఇచ్చే ఆహారంలో సోయాబీన్ కీలకమైనది. శరీరంలో కొలెస్టరాల్ నియంత్రణతోపాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు సోయాలో ఎక్కువగా ఉంటాయి. ఇటీవల దీని వినియోగం పెరిగినా.. పొద్దున్నే అల్పాహారంలో భాగంగా చేసుకోవడం మాత్రం అతి తక్కువ. సోయాబీన్ ను సన్నగా తరిగి అటుకులతో చేసుకునే పోహాలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News