ఎమ్మెల్సీ అనంత‌బాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు

  • ఆదివారం మృతి చెందిన అనంత‌బాబు త‌ల్లి
  • త‌ల్లి అంత్యక్రియ‌లకు హాజ‌ర‌య్యేలా బెయిల్ ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ పిటిష‌న్‌
  • ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబుకు సోమ‌వారం మ‌ధ్యంతర బెయిల్ ద‌క్కింది. అనంత‌బాబుకు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అనంత‌బాబు త‌ల్లి అనారోగ్య కార‌ణాల‌తో ఆదివారం మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేలా త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ అనంత‌బాబు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు...ఆయ‌న‌కు 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, కోర్టు ఆయ‌న‌కు ప‌లు ష‌ర‌తులు విధించింది. ఈ నెల 25 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల్లోగా తిరిగి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలుకు వ‌చ్చి లొంగిపోవాల‌ని కోర్టు ఆయ‌న‌ను ఆదేశించింది. అంతేకాకుండా 3 రోజుల పాటు స్వ‌గ్రామం ఎల్ల‌వ‌రం దాటి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని కూడా తెలిపింది. త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు మాత్ర‌మే ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని తెలిపింది. అనంత‌బాబుతో నిత్యం పోలీసులు ఉండాల‌ని ఆదేశించింది. అంతేకాకుండా కేసు గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించకూడ‌ద‌ని ష‌ర‌తు విధించింది. రూ.25 వేల బాండు, ఇద్దరు వ్య‌క్తుల పూచీక‌త్తుతో బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.


More Telugu News