భారత అధినాయకత్వంపై ఆత్మాహుతి దాడికి కుట్ర... ఐఎస్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న రష్యా

  • ఆత్మాహుతి కుట్రను భగ్నం చేసిన రష్యా 
  • ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అదుపులో ఐఎస్ ఉగ్రవాది
  • భారత ప్రభుత్వంలోని ప్రముఖ నేత అతడి టార్గెట్
  • అతడు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడన్న ఎఫ్ఎస్ బీ
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) భారత్ లో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నిన విషయం వెల్లడైంది. ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్ బీ) బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత అధినాయకత్వంలోని ఒకరిపై ఆత్మాహుతి దాడికి అతడు సిద్ధమైనట్టు ఎఫ్ఎస్ బీ వెల్లడించింది. రష్యాలో ఐఎస్ ఉగ్రవాద సంస్థపై నిషేధం ఉంది. 

కాగా, తాము అరెస్ట్ చేసిన ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందినవాడని, భారత్ లోని అధికార పక్ష ప్రముఖుల్లో ఒకరిని అంతమొందించేందుకు తనను తాను పేల్చివేసుకునేందుకు అతడు ప్రణాళిక రూపొందించాడని రష్యా భద్రతా సంస్థ ఎఫ్ఎస్ బీ వివరించింది. ఆ ఉగ్రవాదిని ఐఎస్ నేతలు టర్కీలో తమ దళంలోకి తీసుకున్నారని, ఆత్మాహుతి దళ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారని తెలిపింది. 

భారత్ పై ఉగ్రవాదుల వ్యతిరేకత ఇప్పటిదికాదు. ఇటీవల నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలతో ఉగ్రవాద సంస్థలు భారత్ అంటే మరింతగా నిప్పులు కక్కుతున్నాయి.


More Telugu News