మోదీ షేక్ హ్యాండ్‌కే చంద్ర‌బాబు మురిసిపోతున్నారు: సీపీఐ నారాయ‌ణ‌

  • టీఆర్ఎస్‌, సీపీఐ మ‌ధ్య రాజ‌కీయంగా పెద్ద సంబంధాలు లేవ‌న్న నారాయ‌ణ‌
  • బీజేపీ రాజ‌కీయ ఆధిప‌త్యం కోస‌మే మునుగోడు ఉప ఎన్నిక అన్న సీపీఐ నేత‌
  • ఉప ఎన్నికల్లో బీజేపీని టీఆర్ఎస్ అడ్డుకుంటుంద‌ని ధీమా
  • పవ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికీ బీజేపీ గూటిలోనే ఉన్నార‌ని వెల్ల‌డి
  • ఏపీలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న వారికే సీపీఐ మ‌ద్దతు అని స్ప‌ష్టీక‌ర‌ణ‌
తెలంగాణ‌లోని న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి త్వర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్‌కు సీపీఐ మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కే తాము ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించే దిశ‌గా సోమ‌వారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ఎస్‌, సీపీఐ మ‌ధ్య రాజ‌కీయంగా పెద్ద సంబంధాలు లేవ‌ని ఆయ‌న అన్నారు. బీజేపీ రాజ‌కీయ ఆధిప‌త్యం కోస‌మే మునుగోడు ఉప ఎన్నిక వ‌చ్చింద‌న్న నారాయ‌ణ‌... ఉప ఎన్నికల్లో బీజేపీని టీఆర్ఎస్ అడ్డుకుంటుంద‌ని తెలిపారు. ఈ కార‌ణంగానే ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని కూడా ఆయ‌న తెలిపారు. 

అనంత‌రం ఏపీ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించిన నారాయ‌ణ‌... జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికీ బీజేపీ గూటిలోనే ఉన్నార‌ని తెలిపారు. మోదీ షేక్ హ్యాండ్‌కే చంద్ర‌బాబు మురిసిపోతున్నారని నారాయ‌ణ‌ ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న వారికే సీపీఐ మ‌ద్దతు ద‌క్కుతుంద‌ని తేల్చి చెప్పారు. దేశంలో ఎన్డీఏకు వ్య‌తిరేక‌త మొదలైంద‌ని, బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను క‌లిపే ప‌నుల్లో సీపీఐ ఉంద‌ని ఆయన తెలిపారు.


More Telugu News