కొవిడ్ సంక్షోభం తర్వాత అత్యధిక జీఎస్డీపీ నమోదు చేసింది మన రాష్ట్రమే: విజయసాయిరెడ్డి

  • ఏడు రాష్ట్రాల్లో రెండంకెల్లో వృద్ధి రేటు శాతం
  • 11.43 శాతంతో ఏపీకి అగ్రస్థానం
  • కొవిడ్ ముందునాటి జీఎస్డీపీ స్థాయులను అధిగమించిన వైనం
  • పత్రికా కథనాన్ని పంచుకున్న విజయసాయి
కరోనా సంక్షోభ సమయంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. వృద్ధి రేటు మందగించడంతో పాటు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) కూడా పడిపోయింది. అయితే, దేశంలోని అనేక రాష్ట్రాలు గణనీయంగా కోలుకుని ముందుంజ వేశాయని, కరోనా సంక్షోభం ముందు ఉన్నప్పటి జీఎస్డీపీ స్థాయులను కూడా దాటిపోయేలా అద్భుతమైన పురోగతిని సాధించాయని కేంద్రం గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో మన ఏపీ కూడా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ మళ్లీ పుంజుకుందని, 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీతో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా ఏపీ కొవిడ్ ముందునాటి జీఎస్డీపీ స్థాయులను కూడా అధిగమించిందని వివరించారు. ఈ ఘనతను సాధించినందుకు ఏపీ ప్రజలకు, సీఎం జగన్ కు అభినందనలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. 

ఈ మేరకు వివిధ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను తెలియజెప్పే ఓ పత్రికా కథనాన్ని కూడా విజయసాయి పంచుకున్నారు. అందులో, ఏపీ 11.43 శాతంతో అత్యధిక జీఎస్డీపీ నమోదు చేస్తే, పుదుచ్చేరి 3.31 శాతంతో అతి తక్కువ జీఎస్డీపీ నమోదు చేసింది.


More Telugu News