అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీపై కిష‌న్ రెడ్డి స్పంద‌న ఇదే

  • భేటీకి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌న్న కిష‌న్ రెడ్డి
  • కేవలం సినిమాల గురించిన అంశాలపై చ‌ర్చ జ‌రిగింద‌ని వెల్ల‌డి
  • సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించిన వివ‌రాల‌పై అమిత్ షా ఆసక్తి క‌న‌బ‌ర‌చార‌న్న కేంద్ర మంత్రి
  • కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌బోన‌ని వ్యాఖ్య 
బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాటి త‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. మునుగోడు స‌భ‌లో పాల్గొనేందుకు తెలంగాణ వ‌చ్చిన అమిత్ షా...ఆదివారం రాత్రి ఢిల్లీకి తిరిగి బ‌య‌లుదేరే ముందు శంషాబాద్ ప‌రిధిలోని నోవాటెల్ హెట‌ల్‌లో ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీపై ప‌లు ర‌కాలుగా ఊహాగానాలు సాగుతుండగా... దీనిపై క్లారిటీ ఇస్తూ బీజేపీకి చెందిన తెలంగాణ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోమ‌వారం స్పందించారు.

అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. రాజ‌కీయాల‌కు ఏమాత్రం సంబంధం లేని స‌మావేశమ‌దని ఆయ‌న తెలిపారు. ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీలో వారిద్ద‌రూ కేవ‌లం సినిమాల‌కు సంబంధించిన అంశాల‌పైనే మాట్లాడుకున్నార‌ని కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ భేటీలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ గురించిన విష‌యాల‌ను అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను అడిగి మ‌రీ తెలుసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి డిన్న‌ర్ చేయాల‌ని అమిత్ షా భావించార‌న్నారు. ఈ భేటీలో రాజ‌కీయ ప్రాధాన్యం ఉందంటూ వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై తానేమీ స్పందించ‌బోన‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు.


More Telugu News