జింబాబ్వేతో మూడో వన్డే: టాస్​ నెగ్గి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​

  • సిరాజ్, ప్రసిధ్ ను తప్పించిన వైనం 
  • తుది జట్టులోకి దీపక్ చహర్, అవేశ్ ఖాన్
  • ధవన్ తో కలిసి ఓపెనింగుకు వచ్చిన రాహుల్
జింబాబ్వేతో మూడో వన్డేలో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియా ఈ సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలిచింది. ఈ పోరులో నూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడోసారి టాస్ నెగ్గిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సారి బ్యాటింగ్ కు మొగ్గు చూపాడు. 

తొలి, రెండో వన్డేలో ఛేజింగ్ లో భారత్ నెగ్గింది. రెండో వన్డేలో రాహుల్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. వచ్చే వారం ఆసియా కప్ ఉన్న నేపథ్యంలో తనతో పాటు మిగతా ఆటగాళ్లకు బ్యాటింగ్ ప్రాక్టీస్ ముఖ్యమని భావించిన కెప్టెన్ ఈసారి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ధావన్ కాస్త దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా.. రాహుల్ మాత్రం జాగ్రత్తగా ఆడుతున్నాడు. పది ఓవర్లకు భారత్ 41/0 స్కోరుతో నిలిచింది. 

ఇక, ఈ మ్యాచ్ కోసం జట్టులో రెండు మార్పులు చేశారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తో పాటు ప్రసిధ్ కృష్ణ ను పక్కనబెట్టి దీపక్ చహర్, అవేశ్ ఖాన్ లను తుది జట్టులోకి తీసుకున్నారు. గాయం నుంచి ఫిబ్రవరి తర్వాత రీఎంట్రీ ఇచ్చిన దీపక్ చహర్ తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. కానీ, అతడిని రెండో మ్యాచ్ కు పక్కనబెట్టడంపై విమర్శలు వచ్చాయి. పూర్తి ఫిట్ నెస్ సాధించకముందే చహర్ ను తొలి వన్డేలో ఆడించారన్న అభిప్రాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్ లో అతను తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.


More Telugu News