ఎండలో నిద్రించడంతో ప్లాస్టిక్ మడతలా మారిన పోయిన మహిళ నుదిటి చర్మం

  • సన్ స్క్రీన్ లోషన్ లేకుండా 30 నిమిషాలు ఎండలో 
    నిద్రించిన బ్రిటన్ యువతి
  • చర్మం కమిలిపోయి, నుదుటిపై ముడతలు రావడంతో అవాక్కు
  • కొన్ని రోజులకు చర్మం పైపొర ఊడిపోవడంతో సాధారణ స్థితికి 
దాదాపు 30 నిమిషాల పాటు ఎండలో నిద్రపోయిన 25 ఏళ్ల యువతి నుదిటి చర్మం ప్లాస్టిక్‌ మడతలా మారిపోయింది. బ్రిటన్ కు చెందిన బ్యూటీషియన్ సిరిన్ మురాద్ బల్గేరియాలో విహారయాత్రలో ఉండగా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోకుండా ఈత కొలను పక్కన 21 డిగ్రీల సెల్సియస్ సూర్యరశ్మిలో బయట నిద్రపోయింది. 

30 నిమిషాల తర్వాత నిద్రలేచే సరికి ఆమె ముఖం ఎర్రబారింది. కాస్త నొప్పిగా అనిపించినా పట్టించుకోలేదు. కానీ, మరుసటి రోజు నిద్రలేచేసరికి ఆమె నుదిటి చర్మం బిగుతుగా మారింది. కనుబొమ్మలను తిప్పినప్పుడు అది ప్లాస్టిక్‌ మడతల మాదిరిగా కనిపించడంతో ఆమె అవాక్కయింది. ఎండకు చర్మం కమిలిపోయిందని, ఒకటి రెండు రోజులు గడిస్తే నయం అవుతుందని భావించిన ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. రోజులు గడిచేకొద్దీ మురాద్ ముఖంపై ఏర్పడ్డ ముడతలు తగ్గిపోయాయి. 

‘తొలుత ముడతలు ఏర్పడినప్పుడు ఏమీ అనిపించలేదు. దానిపై ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే నొప్పి కలిగింది. మరుసటి రోజు మాత్రం చాలా బాధ కలిగింది. కానీ, చర్మం పైపొర ఊడిపోవడం మొదలైన తర్వాత కొంత ఉపశమనం లభించింది. చర్మం ఊడిపోతున్నా నాకు నొప్పి ఏమీ కలగలేదు. విచిత్రంగా, నా చర్మం ఇప్పుడు చాలా బాగుంది. మునుపటి కంటే మెరుగ్గా అనిపిస్తుంది’ అని మురాద్ చెప్పింది. 

ఈ ఘటన తర్వాత మురాద్ ఇప్పుడు సన్‌స్క్రీన్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఆసక్తిగా ఉంది. సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించకపోవడం వల్లే తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెప్పింది. ఎండలోకి వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాలని కోరింది. కాగా, ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మురాద్ చర్మం, ఆమె బుగ్గలపై ఏర్పడ్డ కొన్ని మచ్చలు పూర్తిగా తొలగిపోయాయి. అయితే, ఇలాంటి లక్షణాలు చర్మ క్యాన్సర్ కు అత్యంత ప్రమాదకరమైన సంకేతాలని వైద్యులు చెబుతున్నారు.


More Telugu News