తలనైనా తెగనరుక్కుంటా.. బీజేపీలో మాత్రం చేరను: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

  • బీజేపీలో చేరాలంటూ తనకు ఎస్ఎంఎస్ వచ్చిందన్న సిసోడియా
  • చేరితే సీబీఐ, ఈడీ కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడి
  • కేజ్రీవాల్ కు ఓ అవకాశం ఇవ్వాలని పిలుపు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. ఇదే కేసులో సీబీఐ ఆయన ఇళ్లలో సోదాలు కూడా  నిర్వహించింది. ఈ క్రమంలో సిసోడియా ట్విట్టర్ లో తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. ‘‘బీజేపీలో చేరితే నాపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని బీజేపీ నుంచి నాకు ఒక సందేశం వచ్చింది’’ అని సిసోడియా వెల్లడించారు. తాను తలనైనా తెగనరుక్కుంటానే కానీ, బీజేపీ లో మాత్రం చేరబోనన్నారు. 

సీబీఐ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వరుస విమర్శలు చేస్తుండడం తెలిసిందే. వీరిద్దరూ కలసి ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ప్రజలు కేజ్రీవాల్ కు ప్రధానిగా ఓ సారి అవకాశం ఇవ్వాలని సిసోడియా ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ చేస్తున్న పనులను.. ముఖ్యంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చూడాలని సిసోడియా కోరడం గమనార్హం. గుజరాత్ పర్యటనలో ఈ ఇద్దరు నేతలు ఆరోగ్యం, విద్యకు సంబంధించి పలు హామీలు ఇవ్వనున్నట్టు పార్టీ  వర్గాలు తెలిపాయి.


More Telugu News