అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యం... ఈరోజు, రేపు గుజరాత్ లో పర్యటించనున్న కేజ్రీవాల్, సిసోడియా

  • త్వరలోనే గుజారాత్ అసెంబ్లీకి ఎన్నికలు
  • గుజరాత్ లో సత్తా చాటాలనుకుంటున్న ఆప్
  • ఢిల్లీ మోడల్ విద్య, వైద్యమే ప్రధాన హామీలుగా ముందుకెళ్తున్న కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీ వెలుపల పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్... గుజరాత్ పై కూడా కన్నేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల రాష్ట్రం గుజరాత్ లో సైతం సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈరోజు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు గుజరాత్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగల్ లో వారు ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు భావ్ నగర్ లో మరో సభను నిర్వహిస్తారు.  

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ స్పందిస్తూ... రెండు రోజుల పర్యటనకు తాను, మనీశ్ సిసోడియా గుజరాత్ కు వెళ్తున్నామని చెప్పారు. విద్య, వైద్యానికి సంబంధించి గుజరాత్ ప్రజలకు గ్యారెంటీ ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరే గుజరాత్ లో కూడా మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుజరాత్ లో ప్రతి ఒక్కరూ ఉచితంగా మంచి విద్య, వైద్య చికిత్సలను పొందుతారని అన్నారు. గుజరాత్ పర్యటనలో యువతతో కూడా సమావేశమవుతామని చెప్పారు.  

మరోవైపు మనీశ్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ టెండర్లకి సంబంధించి అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు... ఆయనకు సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు.


More Telugu News