కేసీఆర్‌, రాజ‌గోపాల్ రెడ్డిల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి?: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్‌కు కోట్లాది రూపాయలు ఇచ్చాన‌ని కోమ‌టిరెడ్డే చెప్పార‌న్న రేవంత్‌
  • ఈ లెక్క‌ల‌ను రాజ‌గోపాల్ రెడ్డి ఐటీ రిట‌ర్న్స్‌లో చూపించారా? అని ప్ర‌శ్న‌
  • రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ స్పందించాల‌ని డిమాండ్‌
  • పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్‌ అని ఎద్దేవా
మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య ర‌హ‌స్య బంధ‌మేదో ఉంద‌ని, అదేమిటో వెల్ల‌డించాల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో శ‌నివారం మునుగోడులో టీఆర్ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌లో కేసీఆర్ చేసిన ప్ర‌సంగంపై ఆదివారం స్పందించిన రేవంత్ రెడ్డి... ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. 

సీఎం కేసీఆర్‌కు కోట్లాది రూపాయలను సహాయం చేసినట్లు స్వ‌యంగా రాజగోపాల్‌ రెడ్డి చెప్పారని ఈ సంద‌ర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? అని రేవంత్ ప్ర‌శ్నించారు. అస‌లు కేసీఆర్‌కు రాజ‌గోపాల్ రెడ్డి ఎందుకు డబ్బులు ఇచ్చారు?.. దీన్ని రాజగోపాల్‌ రెడ్డి.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ లెక్కల్లో చూపించారా? అని కూడా రేవంత్ ప్ర‌శ్నించారు. రాజగోపాల్‌ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసిఆర్ అని రేవంత్ ఆరోపించారు. బీజేపీకి కేసీఆరే ఆదర్శమ‌ని కూడా ఆయ‌న అన్నారు. పార్టీల విలీనానికి కిటికీలు తెరిచిందే కేసీఆర్ అన్న రేవంత్‌... ఏకలింగంగా ఉన్న బీజేపీకి మూడు తోకలు చేసింది కేసీఆరేన‌ని విమర్శించారు. కేసీఆర్ గతంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని అవమానించారన్న రేవంత్‌... ప్రస్తుతం కమ్యూనిస్ట్  సోదరులు ఎందుకు కేసీఆర్ ఉచ్చులో పడుతున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News