పరీక్షల్లో కాపీ కొట్టకుండా అసోంలో ఇంటర్నెట్ సేవలు బంద్
- రాష్ట్రవ్యాప్తంగా మూడు, నాలుగో తరగతి ఉద్యోగాలకు పరీక్షలు
- ఆ సమయంలో నిలిచిపోనున్న మొబైల్ ఇంటర్నెట్ సేవలు
- ప్రకటించిన ఆసోం రాష్ట్ర సర్కారు
అల్లర్లు, ఘర్షణల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని చూశాం. కానీ, తొలిసారిగా అసోం రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటీసు ప్రకారం.. ఆగస్ట్ 21, 28న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 - 4 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది. మూడో తరగతి ఉద్యోగాలతోపాటు, నాలుగో తరగతి ఉద్యోగాలకు సైతం అయా తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం 14 లక్షల మంది హాజరుకానున్నారు.
పరీక్షలు పారదర్శకంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. గత పరీక్షల సందర్భంగా ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర అప్లికేషన్ల వినియోగానికి సంబంధించి అనుచిత విధానాలు వెలుగు చూశాయని వివరించింది.