వివాదాస్పద ప్రకటనపై క్షమాపణలు వేడుకున్న జొమాటో
- ఉజ్జయిని ప్రజల మనోభావాలకు ఎంతో గౌరవిస్తామని ప్రకటన
- ఎవరి విశ్వాసాలను గాయపరచడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ
- ప్రకటనలో స్వల్ప మార్పులు
తనకు ఆకలి అయితే మహాకాళి నుంచి ఆర్డర్ చేస్తానంటూ హృతిక్ రోషన్ నటించిన వివాదాస్పద ప్రకటన విషయంలో జొమాటో తప్పు సరిదిద్దుకుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరం పూజారుల డిమాండ్ మేరకు ప్రకటనను సరిచేయడమే కాకుండా, జరిగిన పొరపాటుకు క్షమాపణలు కూడా కోరింది.
మహాకాల్ అన్న చోటు రెస్టారెంటును చేర్చి ప్రకటనలోని కంటెంట్ ను సవరించింది. అంతేకానీ, మహాకాళేశ్వర్ ఆలయం నుంచి కాదని వివరణ ఇచ్చింది. ఈ మేరకు జొమాటో ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఈ ప్రకటన పట్ల ఉజ్జయిని ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు, జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై బాయ్ కాట్ జొమాటో ఉద్యమం కూడా మొదలైంది.
‘‘ఉజ్జయిని ప్రజల మనోభావాలకు మేము ఎంతో గౌరవం ఇస్తాం. సంబంధిత ప్రకటన ఇక ఎంత మాత్రం కొనసాగదు. ఎవరి విశ్వాసాలు, మనోభావాలను గాయపరచడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు’’ అని జొమాటో ప్రకటించింది.