భర్తను తుపాకితో కాల్చి చంపించిన భార్య

  • పథకం ప్రకారం ఇంటి తలుపులు తెరిచిపెట్టిన నిందితురాలు
  • తెల్లవారుజామున బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన నిందితులు
  • గతంలోనూ భర్త హత్యకు పలుమార్లు కుట్ర
  • రెండు బులెట్లు, హెల్మెట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • తుపాకిని బీహార్ నుంచి కొనుగోలు చేసిన నిందితుడు 
వివాహేతర సంబంధం మోజులో ఓ మహిళ తన భర్తను చంపేందుకు రకరకాలుగా ప్లాన్ చేసింది. అన్నీ వికటించడంతో చివరికి నిద్రపోతున్నప్పుడు తుపాకితో కాల్చి చంపించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటకు చెందిన రవళికి కొరకొప్పుల రాజేందర్ (28)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. అయితే, అప్పటికే రవళికి మరో యువకుడితో సంబంధం ఉండడంతో భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. విషయం తెలిసిన రాజేందర్ పలుమార్లు భార్యను నిలదీశాడు. ఈ విషయమై ఇటీవల పంచాయితీ కూడా జరిగింది. తప్పుడు పనులు మానుకుంటానని,  భర్తతోనే ఉంటానని పెద్దల ముందు రవళి అంగీకరించింది. 

రవళికి తన తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టం లేకపోవడంతో రాజేందర్ పక్క ఊర్లో ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం సింగరేణిలో తండ్రి వారసత్వంగా రాజేందర్‌కు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన రాజేందర్ రాత్రి నిద్రపోయాడు. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న రవళి శనివారం తెల్లవారుజామున పథకం ప్రకారం ఇంటి తలుపులు తెరిచిపెట్టింది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇంట్లోకి వెళ్లి రాజేందర్ కుడి కణతపై రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తుపాకి శబ్దానికి లేచిన ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి రాజేందర్ రక్తపుమడుగులో చనిపోయి కనిపించాడు. తాను టాయిలెట్‌ కోసం బయటకు వెళ్లి వచ్చే సరికే ఈ దారుణం జరిగిందని, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఒకరు తుపాకితో కాల్పులు జరిపి పరారయ్యాడని రవళి నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కాగా, భర్తను అడ్డుతొలగించుకునేందుకు రవళి గతంలోనూ రెండుసార్లు ప్రయత్నించినట్టు రాజేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

ఒకసారి ఇంటిగేటుకు విద్యుత్ వైరు తగిలించిందని, మరోసారి కారుతో ఢీకొట్టించిందన్నారు. కాగా, హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు తూటాలు, హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులతోపాటు రవళిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేందర్‌ను కాల్చేందుకు ఉపయోగించిన తుపాకిని బీహార్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. బందం రాజు, సయ్యద్‌తో కలిసి రవళి తమ కుమారుడిని హత్య చేయించినట్టు రాజేందర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


More Telugu News