సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 21 లక్షలు నష్టపోయిన మదనపల్లె రిటైర్డ్ టీచర్

  • వాట్సాప్ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు
  • అదేమిటో తెలియక ఓపెన్ చేసిన బాధితురాలు
  • పలు దఫాలుగా రూ. 21 లక్షలు మాయం
  • మదనపల్లెకే చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఖాతా నుంచి రూ. 12 లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన రిటైర్డ్ టీచర్ వరలక్ష్మి బ్యాంకు ఖాతాలోంచి సైబర్ నేరగాళ్లు రూ. 21 లక్షలు మాయం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరలక్ష్మి వాట్సాప్‌కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. అది ఏమిటో తెలియక ఆమె దానిని పలుమార్లు ఓపెన్ చేశారు. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేశారు. అంతే.. అప్పటి నుంచి ఆమె ఖాతాలోంచి పలు దఫాలుగా నగదు మాయమైంది. అలా మొత్తంగా రూ. 21 లక్షలను నేరగాళ్లు దోచుకున్నారు. 

ఖాతాలోంచి డబ్బులు కట్ అయిన ప్రతిసారీ మొబైల్‌కు మెసేజ్‌లు వస్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఖాతా హ్యాక్ అయినట్టు బ్యాంకు అధికారులు చెప్పడంతో వరలక్ష్మి నిన్న సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబరు 1930కి ఫిర్యాదు చేశారు. కాగా, మదనపల్లెకే చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జ్ఞానప్రకాశ్ ఖాతా నుంచి ఇలాగే రూ. 12 లక్షలు మాయమయ్యాయి.


More Telugu News