జింబాబ్వేతో రెండో వన్డే.. విజయానికి చేరువలో ఇండియా

  • హరారేలో జరుగుతున్న రెండో వన్డే
  • 161 పరుగులకు జింబాబ్వేను కుప్పకూల్చిన భారత బౌలర్లు
  • విజయానికి 46 పరుగుల దూరంలో భారత్
జింబాబ్వే గడ్డపై టీమిండియా చెలరేగుతోంది. ఆ దేశంతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇప్పటికే తొలి వన్డేను కైవసం చేసుకున్న భారత్... రెండో వన్టేలో కూడా విజయం దిశగా సాగుతోంది. హరారేలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ నెగ్గిన ఇండియా రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై మన బౌలర్లు చెలరేగిపోయారు. జింబాబ్వేను కేవలం 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ చేశారు. సీన్ విలియమ్స్ చేసిన 42 పరుగులే ఆ దేశ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక పరుగులు కావడం గమనార్హం. మన బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ తీశారు. ఇద్దరు రనౌట్ అయ్యారు.  

అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గిల్ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఇద్దరూ కూడా చెరో 33 పరుగుల వంతున చేసి అవుటయ్యారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు. సంజు శాంసన్ 9 పరుగులతో, దీపక్ హుడా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా విజయం సాధించడానికి మరో 46 పరుగులు అవసరం.


More Telugu News