2024 ఎన్నికల్లో కేజ్రీవాల్ కు, మోదీకి మధ్యే పోటీ... తనపై దాడుల నేపథ్యంలో మనీశ్ సిసోడియా వ్యాఖ్యలు

  • ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు
  • కేజ్రీవాల్ కు భయపడి మోదీ ఇదంతా చేస్తున్నారన్న సిసోడియా
  • తమ ప్రభుత్వం గురించి న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపాటు
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు, అవినీతి చోటుచేసుకున్నాయంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంపై సీబీఐ సోదాలు జరపడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై సిసోడియా నిప్పులు చెరిగారు. కేంద్ర వ్యవస్థలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే తన నివాసంలో సీబీఐ సోదాలు జరిగాయని అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పనితీరు... విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన ప్రక్షాళనలను జీర్ణించుకోలేక... కేజ్రీవాల్ ను నిలువరించడానికి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. 

ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఏం జరిగిందనేది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదని... మోదీ ప్రభుత్వం కేవలం కేజ్రీవాల్ గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని సిసోడియా అన్నారు. 2024 ఎన్నికల్లో తనకు ప్రధాన పోటీ కేజ్రీవాల్ నుంచే ఉంటుందని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు మోదీకి, కేజ్రీవాల్ కు మధ్య జరగబోతున్నాయని చెప్పారు. 

ఇక తమ ఎక్సైజ్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా ఉందని సిసోడియా తెలిపారు. కొన్ని రోజుల వ్యవధిలో తనను కచ్చితంగా అరెస్ట్ చేస్తారని... అయితే, ఇది తమ పార్టీ చేస్తున్న మంచి పనులకు విఘాతం కలిగించలేదని అన్నారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ పై న్యూయార్క్ టైమ్స్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో కథనం వచ్చిందని... దీన్ని జీర్ణించుకోలేకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులు చేస్తోందని సిసోడియా మండిపడ్డారు. 

మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... లిక్కర్ స్కామ్ లో సిసోడియా కేవలం ఒక నిందితుడు మాత్రమేనని... కింగ్ పిన్ మాత్రం కేజ్రీవాల్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో గొప్ప హామీలను గుప్పించిందని... అయితే మోదీ ముందు ఆ పార్టీ నిలవలేకపోయిందని అన్నారు. 

లిక్కర్ పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీలోని సిసోడియా నివాసంతో పాటు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉండగా... వారిలో సిసోడియాను ప్రథమ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. సీబీఐ తన 11 పేజీల డాక్యుమెంట్ లో అవినీతి, నేరపూరిత కుట్ర, తప్పుడు ఆర్థిక లావాదేవీలను ప్రధానంగా ఆరోపించింది.

సిసోడియాకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక లిక్కర్ ట్రేడర్ కోటి రూపాయలను చెల్లించాడని సీబీఐ ఆరోపించింది. లిక్కర్ కంపెనీలు, ఈ మధ్యవర్తి కలిసి అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంది. మరోవైపు సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు జరిగిన వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించారు.


More Telugu News