తాగండి బాబూ.. తాగండి.. యువతతో మద్యం తాగించేందుకు ప్లాన్ చెప్పండి.. పోటీ పెట్టిన జపాన్

  • కొంతకాలం నుంచి జపాన్‌లో తగ్గిపోయిన మద్యం విక్రయాలు
  • ఆల్కహాల్‌ కు దూరంగా ఉంటున్న జపాన్‌ యువత
  • ఆదాయం పెంచుకోవడం కోసం ఆల్కహాల్‌ ను ప్రోత్సహించే పోటీ పెట్టిన అధికారులు 
సాధారణంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. పన్నులు పెంచుతాయి. చార్జీలు వడ్డిస్తాయి. మరేదైనా మార్గం చూస్తుంటాయి. అలాంటి దానిలో మద్యం ఆదాయం ఒకటి. ఇదంతా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు చేసే పని.. అసలే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా, క్రమశిక్షణ కలిగిన దేశంగా పేరున్న జపాన్‌ లోనూ ప్రభుత్వం యువతకు మద్యం అలవాటు పెంచే పనిలో పడింది. అదీ యువతకు ఆల్కహాల్‌ అలవాటు పెంచేందుకు ఏం చేయాలో చెప్పాలంటూ ప్రజలకే పోటీ పెట్టింది.

ఇంట్లో ఆల్కహాల్ వినియోగం పెంచేదెలా?
సాధారణంగా జపాన్‌ జనంలో క్రమశిక్షణ ఎక్కువ. అందువల్ల మద్యానికి దూరంగా ఉండేవారి శాతమూ ఎక్కువే. ముఖ్యంగా యువత ఆల్కహాల్‌ కు దూరంగా ఉండటంతో జపాన్‌లో మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. ఇక కరోనా కాలం నుంచి అయితే ఆదాయం మరింతగా పడిపోయింది. 

దీనితో ఆల్కహాల్‌ అలవాటు పెంచి, ఆదాయం పెంచుకోవాలని జపాన్‌ పన్నుల శాఖ ప్లాన్ చేసింది. మద్యం వినియోగాన్ని పెంచేందుకు ‘సేక్ వివా’ పేరిట ప్రచారం ప్రారంభించింది. మద్యం ఆదాయం పెంచుకోవడం కోసం,  ఇళ్లలో ఆల్కహాల్ అలవాటును ప్రోత్సహించేందుకు.. 20 నుంచి 39 ఏళ్ల మధ్య యువత తగిన ఐడియాలు ఇవ్వాలని కోరింది. నవంబర్ 10న విజేతలను ప్రకటిస్తామని పేర్కొంది.
  • జపాన్‌ అధికారిక లెక్కల ప్రకారం.. ఆ దేశంలో 1995లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల ఆల్కహాల్ తీసుకోగా.. 2020 నాటికి అది 75 లీటర్లకు పడిపోయింది. మద్యం పన్నుల ఆదాయం గతంలో 5 శాతం ఉంటే.. ఇప్పుడు 1.7 శాతానికి తగ్గిపోయింది. 
  • కరోనా మహమ్మారితో పాటు యువత కెరీర్ పై ఎక్కువ దృష్టిపెట్టడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో జపాన్ కే ప్రత్యేకమైన జపనీస్ సేక్‌, శోచు వంటి ఆల్కహాల్ డ్రింకులతోపాటు ఇతర సాధారణ లిక్కర్ వినియోగం తగ్గిపోయిందని జపాన్ అధికారులు చెబుతున్నారు.


More Telugu News