తన కెప్టెన్సీ ‘సింపుల్’ అంటున్న రోహిత్ శర్మ

  • సారథిగా అన్ని విషయాలు సింపుల్ గా ఉంచుతానన్న రోహిత్ 
  • ఆటగాళ్లలో గందరగోళం లేకుండా చూసుకుంటానన్న భారత కెప్టెన్
  • ఐపీఎల్ సక్సెస్ తో టీమిండియా అన్ని ఫార్మాట్లకు నాయకుడిగా ఎదిగిన రోహిత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ కు రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని అందుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో వన్డే, టీ20 సారథ్యం స్వీకరించిన రోహిత్.. ఈ ఫిబ్రవరిలో టెస్టు పగ్గాలు కూడా అందుకుని ఇండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ గా మారాడు.

తాజాగా తన కెప్టెన్సీ శైలి గురించి రోహిత్ మాట్లాడుతూ, సారథిగా జట్టులో తాను అన్ని విషయాలను సింపుల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. ఏ విషయంలో అయినా సరే ఆటగాళ్ల మధ్య గందరగోళం లేకుండా చూడటంతో పాటు, జట్టులో వారి పాత్రలపై స్పష్టత ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. 

‘ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ గా కొన్ని సంవత్సరాలుగా నేను ఏం చేస్తున్నానో.. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఈ సమయంలో అలానే చేస్తున్నా. ఏ విషయాన్నీ క్లిష్టతరం చేయకుండా సింపుల్ గా ఉంచడం నాకు ఇష్టం. జట్టులో ప్రతీ ఆటగాడికి స్వేచ్ఛనిస్తా. అదే సమయంలో జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి అర్థమయ్యేలా చేస్తా. నేను నా నుంచి ఏం ఆశిస్తున్నానో.. జట్టు నుంచి కూడా అదే కోరుకుంటా. కాబట్టి ఆటగాళ్లలో గందరగోళం లేకుండా చూసుకోవాలనుకుంటున్నా. అత్యున్నత స్థాయిలో ఆడుతున్నప్పుడు ఎలాంటి అస్పష్టత ఉండకూడదు. రాహుల్ భాయ్ (కోచ్ ద్రవిడ్)తో కలిసి జట్టులో అంతా సవ్యంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. మేం దానిపై ఫోకస్ పెడతాం. అన్నీ సింపుల్ గా ఉండాలనుకుంటా కాబట్టి నా వరకైతే ఇది చాలా సులువైన విషయం’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. 

కొంతమంది ఆటగాళ్లు కష్ట సమయాల్లో ఉన్నారని తెలిసినప్పుడు వారికి అండగా నిలుస్తామని చెప్పాడు. అలాంటి ప్లేయర్లకు పరిస్థితిని వివరించి, వారి నుంచి మేం ఏం ఆశిస్తున్నామో అర్థమయ్యేలా చెబుతామని రోహిత్ తెలిపాడు. ‘కాబట్టి, నేను గేమ్ ఆడేటప్పుడు ప్రత్యేక మంత్రంతో ఏమీ వెళ్లను. జట్టులో ఆటగాళ్లకు ఏం అవసరం? వాళ్ల బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకొని, ఏ విషయంలో మెరుగవ్వాలో వాళ్లకు తగిన సూచనలు చేస్తుంటా’ అని రోహిత్ వెల్లడించాడు.


More Telugu News