నా ఉన్నతికి, విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు: సీజేఐ ఎన్వీ రమణ

  • న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్న సీజేఐ  
  • న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్య 
  • కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్న జస్టిస్ రమణ 
దేశంలో కోర్టుల్లో ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు. న్యాయవ్యవస్థను బలోపేతం చేసే పనుల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం కూడా చాలా అవసరమని చెప్పారు. 

విజయవాడలో ఈరోజు నూతన కోర్టు కాంప్లెక్స్ ను సీజేఐ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించే బాధ్యత న్యాయవాదులపై ఉందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్లను ప్రోత్సహించాలని తెలిపారు. సమాజంలో మార్పు కోసం కృషి చేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామని అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని... అలాంటి రాష్ట్రాల్లో కోర్టు భవనాల నిర్మాణాల కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. 

తాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో మంది సహకారం ఉందని అన్నారు. తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థలో తన వంతుగా చాలా ఖాళీలను భర్తీ చేశానని... అన్ని కులాలు, ప్రాంతాల వారికి ప్రాతినిధ్యం కల్పించానని తెలిపారు.


More Telugu News