నేను చేసిన సినిమాలన్నిటికంటే 'అర్థం' నాకు వెరీ స్పెషల్: శ్రద్ధా దాస్

  • మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రద్ధా దాస్
  • 'అర్థం' చిత్రంలో సైకియాట్రిస్ట్ పాత్రను పోషిస్తున్న శ్రద్ధ
  • మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
ముంబై భామ శ్రద్ధా దాస్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. మాయ అనే సైకియాట్రిస్ట్ పాత్రను ఈ చిత్రంలో ఆమె పోషిస్తోంది. ఈ సినిమాకు మణికాంత్ తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లోకి కూడా అనువదించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా శ్రద్ధా దాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లోకెల్లా ఇది స్పెషల్ అని చెప్పింది. దర్శకనిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకుని సినిమాను చక్కగా తెరకెక్కించారని తెలిపింది. ఈ సినిమాలో గ్లామరస్ సైకియాట్రిస్ట్ గా తాను నటించానని చెప్పింది. మంచి టీమ్ తో మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని తెలిపింది. 

చిత్ర నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ... సైకలాజికల్ థ్రిల్లర్ కథకు వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్న ఈ మూవీకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


చిత్ర దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ... తన తండ్రి ఒక సినిమా ఆపరేటర్ అని, ఈరోజు తాను ఈ స్టేజ్ పై ఉండటానికి తన తండ్రే స్ఫూర్తి అని చెప్పారు. మహిళా సాధికారత, కుటుంబ విలువలను కాపాడే సరికొత్త కథాంశంతో సినిమాను రూపొందించామని తెలిపారు. మానవ సంబంధాలను ఈ చిత్రంలో చూపించామని తెలిపారు. శ్రద్ధా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో ఆమని, అజయ్, సాహితీ అవంచ, నందన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 


More Telugu News