ఆల్కహాల్ పై మహాత్మాగాంధీ మాటల్ని గుర్తుచేసిన గౌతమ్ గంభీర్
- ఢిల్లీలో మద్యం విధానంలో అక్రమాల నేపథ్యంలో సీబీఐ దాడులు
- మద్యం శరీరాన్నే కాదు, ఆత్మనూ నాశనం చేస్తుందన్న గాంధీ మాటలను ఉటంకించిన గంభీర్
- ట్విట్టర్ లో ఆసక్తికర పోస్ట్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇళ్లపై సీబీఐ దాడుల నేపథ్యంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ హిందీలో ఆసక్తికర ట్వీట్ చేశాడు. మహాత్మాగాంధీ మాటలను గుర్తు చేశాడు. ఆల్కహాల్ (మద్యం) శరీరాన్నే కాదు, ఆత్మనూ నాశనం చేస్తుందని మహాత్మాగాంధీ చెప్పినట్టు గంభీర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మనీశ్ సిసోడియా ఇళ్లపై సీబీఐ దాడుల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఇతర ఆప్ నేతలు కేంద్ర సర్కారును తప్పుబడుతుంటే.. బీజేపీ నేతలు మాత్రం సమర్థించుకుంటున్నారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు ఇటీవల కొత్త మద్యం విధానానికి మళ్లడం తెలిసిందే. నూతన విధానంలో సర్కారే వైన్ షాపులను నిర్వహించనుంది. ఈ క్రమంలో గంభీర్ మహాత్మాగాంధీ మద్యం గురించి చెప్పిన కొటేషన్ ను గుర్తు చేయడం ఆసక్తి కలిగించింది. మద్యం విధానంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆప్, కేజ్రీవాల్, సిసోడియా అసలైన రూపాలు నేడు ప్రజల ముందు బహిర్గతమయ్యాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అవినీతి పరుడు ఎప్పటికీ అవినీతిపరుడేనన్నారు.