భుజంలో నొప్పి.. నిర్లక్ష్యం మంచిది కాదు

  • దేని కారణంగా వస్తుందన్నది తేల్చాలి
  • అప్పుడే చికిత్స మార్గాలు తెలిసేది
  • నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాల నొప్పిగా మారే ప్రమాదం
భుజంలో నొప్పి.. నేటి రోజుల్లో ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్న సమస్యల్లో ఇదీ ఒకటి. అది కండరాల్లో సమస్య కావచ్చు లేదంటే జాయింట్స్ లో సమస్య నొప్పి రూపంలో చూపించొచ్చు. లేదా షోల్డర్ జాయింట్ పట్టేసి ఉండొచ్చు. అందుకే భుజంలో నొప్పి ఏదైనా.. నిర్లక్ష్యం అన్నదే పనికిరాదు. దీర్ఘకాలం పాటు కొనసాగితే అది చికిత్సకు లొంగకుండా తయారవుతుంది. 

వైద్యుల వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకుంటేనే అసలు సమస్య ఏదన్నది తెలుస్తుంది. దాంతో చికిత్స సులభం అవుతుంది. పరిష్కారం కూడా లభిస్తుంది. పట్టేసినట్టు, నొప్పిగా కొన్ని రోజుల పాటు ఉంటే అది భుజంపై పడుకోవడం సరిగ్గా చేయడం లేదని అర్థం. సమస్యను చాలా ముందుగా గుర్తించడం ఒక్కటే త్వరగా పరిష్కరించుకోవడానికి మార్గమని అందరూ తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేసి వదిలేస్తే అది దీర్ఘకాల సమస్యగా మారిపోతుంది.

ఎన్నో కండరాలు, స్నాయువులు (కండరాలను బంధించేవి), లిగమెంట్లు కలసి షోల్డర్ జాయింట్ ఏర్పడుతుంది. రాయాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, తోయాలన్నా భుజం జాయింట్ చాలా కీలకంగా పనిచేస్తుంటుంది. అందుకని దీన్ని వీలైనంత కదలికలు ఉండేలా చూసుకోవాలన్నది వైద్యుల సూచన. 

ఆస్టియో ఆర్థరైటిస్, రొటేరర్ కఫ్ ఇంజూరీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, బర్సైటిస్ లోనూ భుజంలో నొప్పి వస్తుంది. నొప్పి చాలా తీవ్రంగా ఉంటే, అది టెండాన్ రప్చర్ కావడం లేదంటే ఫ్రోజన్ షోల్డర్ (పట్టేయడం), స్ప్రెయిన్, భుజం స్థాన భ్రంశం చెందడం, బ్రోకెన్ షోల్డర్ వంటి సమస్యల్లోనూ ఇలా జరగొచ్చు. 

మెడలో సమస్యలు, గ్లెనో హ్యుమరల్ జాయింట్, అక్రోమైయోక్లావిక్యులర్ జాయింట్, రొటేటర్ కఫ్ కారణంగా భుజంలో నొప్పి రావచ్చు. అందుకే భుజంలో నొప్పి కనిపిస్తే ఆలస్యం చేయకుండా వేగంగా వైద్య నిపుణులను సంప్రదించడం ఒక్కటే ఈ సమస్యకు మెరుగైన పరిష్కారాల్లో ఒకటి.


More Telugu News