మహారాష్ట్ర తీరంలో బోటు కలకలం... ఏకే-47 తుపాకులు గుర్తించిన పోలీసులు

  • హరిహరేశ్వర్ బీచ్ కు కొట్టుకొచ్చిన బోటు
  • బోటులో మూడు తుపాకులు, మందుగుండు
  • తీరప్రాంతంలో భయాందోళనలు
  • బోటు ఆస్ట్రేలియా దంపతులదన్న ఫడ్నవీస్
  • ఇంజిన్ లోపంతో బోటును వదిలేశారని వెల్లడి
మహారాష్ట్ర తీరంలో ఓ విదేశీ బోటు కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యంకావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని తెలిపారు. 

బోటు ఇంజిన్ లో లోపం తలెత్తడంతో ఆ ఆస్ట్రేలియన్ దంపతులు బోటును వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీలేదని స్పష్టం చేశారు. అయితే, ఆస్ట్రేలియన్లు ఆ బోటులో ఆయుధాలు ఎందుకు తీసుకెళుతున్నారన్నది తెలియరాలేదని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

బాగా దెబ్బతిన్న స్థితిలో ఉన్న బోటును ముంబయికి 190 కిమీ దూరంలోని రాయ్ గఢ్ హరిహరేశ్వర్ బీచ్ లో గుర్తించారు. అందులో ఏకే-47 తుపాకులు, మందుగుండు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోటు పేరు లేడీ హాన్. హనా లాండర్గన్ దీని యజమాని. ఆమె భర్త జేమ్స్ హార్బెర్ట్ కెప్టెన్ గా పనిచేస్తున్నారని ఫడ్నవీస్ తెలిపారు. 

ఆ బోటు మస్కట్ మీదుగా యూరప్ వెళుతుండగా జూన్ 26న ఇంజిన్ చెడిపోయింది. అదే రోజున బోటులోని వారిని కొరియాకు చెందిన ఓ యుద్ధనౌక కాపాడింది. బోటును మాత్రం అక్కడే వదిలేశారు. అది అలల తాకిడికి మహారాష్ట్ర తీరం దిశగా కొట్టుకువచ్చింది. బోటులో తుపాకులను గుర్తించిన వెంటనే, ఉగ్రవాద భయంతో మహారాష్ట్ర తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఇందులో ఉగ్రకోణమేమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


More Telugu News