ఇన్నాళ్లూ బాయ్ కాట్ లను భరించి తప్పు చేశామంటున్న బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్

  • బాలీవుడ్ ఏకం అయితేనే దీన్ని తిప్పికొట్టగలమంటున్న అర్జున్ కపూర్
  • కొన్నాళ్లుగా బాలీవుడ్ లో ప్రధాన సమస్యగా మారిన బాయ్ కాట్ ట్రెండ్
  • ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ను దెబ్బకొట్టిన సెగ
బాయ్ కాట్ ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ కు ప్రధాన సమస్యగా మారింది. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’తో ప్రారంభమైన ఈ ట్రెండ్ అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’,  ఇంకా విడుదల కాని హృతిక్ రోషన్ ‘విక్రమ్ వేద’ను కూడా తాకింది. ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై యువ నటుడు అర్జున్ కపూర్ స్పందించాడు. బాలీవుడ్ మొత్తం ఐక్యం అయితేనే దీన్ని ఎదుర్కోగలం అన్నాడు. ఇన్నాళ్లూ దీనిపై మౌనంగా ఉండి బాలీవుడ్ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. 

‘బాయ్ కాట్ గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండి మేము తప్పు చేశాం. అది మా మర్యాద అనుకున్నాం. కానీ, కొందరు దీని నుంచి ప్రయోజనం పొందడం ప్రారంభించారు. ఇన్నాళ్లూ మా పనే మా గురించి చెబుతుంది అనుకుని మేం పొరపాటు చేశాం. ప్రతీసారి బురదలో చేయి పెట్టడం ఎందుకని మేం అనుకుంటే కొందరు మా సహనాన్ని చేతకానితనంగా భావించారు. బాయ్ కాట్ ను ఓ ట్రెండ్ గా మార్చారు. ఇప్పుడు ప్రజలు మన గురించి రాసే రాతలు, ట్రెండ్ చేసే హ్యాష్‌ట్యాగ్‌లు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయి. దీన్ని ఎదుర్కొనేందుకు  మనమంతా ఏకం కావాలి’ అని అర్జున్ కపూర్ పిలుపునిచ్చాడు.  

సినిమాలను బహిష్కరించాలనే సంస్కృతి అన్యాయం అన్నాడు. ఇంతకుముందు కొత్త విడుదల కోసం ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉండేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు అధ్వానంగా మారాయని అర్జున్ అన్నాడు. ‘ప్రతి శుక్రవారం ఉదయం ప్రజల్లో ఉత్తేజం ఉండేది. కొత్త చిత్రం కోసం వాళ్లు ఉత్సాహం చూపిస్తుంటే పరిశ్రమ ప్రకాశవంతంగా వెలిగిపోయేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోవడం శోచనీయం.  కొంతకాలంగా కొందరు మనపై బురద జల్లుతున్నారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రజల అభిప్రాయం మారుతుందని భావిస్తున్నాం’ అని అర్జున్ కపూర్ పేర్కొన్నాడు.


More Telugu News