విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే పీక కోసి పరారైన స్నేహితులు

  • తనను తక్కువగా చేసి మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన స్నేహితుడు
  • పథకం ప్రకారం బార్‌కి తీసుకెళ్లిన వైనం!
  • మధ్యలో వెళ్లి కత్తి తీసుకొచ్చిన మరో స్నేహితుడు
  • ఆపై నడిరోడ్డుపై పొడిచి చంపిన వైనం
  • పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు!
విశాఖపట్టణంలో ఓ రౌడీషీటర్‌ను అతడి స్నేహితులే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణంగా హత్య చేశారు. ఆపై ప్రజలు తేరుకునేలోగానే అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్ (36).. ఎంవీపీ కాలనీలోని ఆదర్శనగర్‌కు చెందిన శ్యామ్‌ప్రకాశ్ స్నేహితులు. 

కారు డ్రైవర్ అయిన అనిల్ ‌కుమార్ రౌడీషీటర్ కాగా, శ్యామ్ ప్రకాశ్ బస్సు డ్రైవర్. అతడిపైనా ఓ కేసు నమోదై ఉంది. ఓ హత్యకేసులో అనిల్ కుమార్‌పై కాకినాడలోనూ కేసు నమోదైంది. గతంలో ఒకసారి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. ఆ తర్వాత రాజీ కుదర్చడంతో మళ్లీ స్నేహితులయ్యారు.

ఇదిలా ఉండగా, నిన్న మధ్యాహ్నం అనిల్ కుమార్, శ్యామ్ ప్రకాశ్, షమీర్, ఎర్రయ్య అనే నలుగురు మిత్రులు కలిసి ఉషోదయ చౌరస్తాలోని ఓ బార్‌లో మద్యం తాగారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత వారి మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో వారిలో ఒకరు బయటకు వెళ్లి మళ్లీ వచ్చాడు. 

సాయంత్రం 4.30 గంటల సమయంలో అందరూ కలిసి బార్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా అనిల్‌తో గొడవపడి ఒకరినొకరు తోసుకున్నారు. అప్పటికే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్యామ్ ప్రకాశ్ మరో స్నేహితుడితో కలిసి అనిల్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణ రహితంగా పొడవడమే కాకుండా అందరూ చూస్తుండగానే అతడి పీక కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా, అనిల్ కుమార్ తనను తక్కువ చేసి హేళనగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకే శ్యామ్ ప్రకాశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అతడిని హత్య చేసే ఉద్దేశంతోనే బార్‌కు తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బార్ నుంచి ఓ వ్యక్తి మధ్యలో బయటకు వెళ్లింది కూడా కత్తి కోసమే అయి ఉంటుందని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రధాన నిందితుడు శ్యామ్ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


More Telugu News