చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ప్రదర్శించిన తైవాన్

  • ఇటీవల నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటన
  • అగ్గిమీద గుగ్గిలంలా చైనా
  • తైవాన్ చుట్టూ భీకర విన్యాసాలు
  • స్పందించిన తైవాన్
  • ఎఫ్-16వి యుద్ధ విమానాలతో విన్యాసాలు
అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైపీలో పర్యటించిన నేపథ్యంలో తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెలోసీ పర్యటనతో భగ్గుమన్న చైనా... తైవాన్ చుట్టూ సైనిక, వాయుసేన విన్యాసాలు చేపట్టి ప్రతీకార జ్వాలలు విరజిమ్మింది. ఈ నేపథ్యంలో, తైవాన్ తన అమ్ములపొదిలోని అత్యంత అధునాతన యుద్ధ విమానం 'ఎఫ్-16వి'ని ప్రదర్శించింది. అది కూడా అరుదైన రీతిలో ఈ యుద్ధ విమానంతో గగన విహారం చేయించింది. ఈ ఎఫ్-16వి ఫైటర్ జెట్ కు అమెరికా తయారీ యాంటీ షిప్ మిస్సైల్ ను కూడా అమర్చారు. 

పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉన్న ఆ ఫైటర్ విమానం తైవాన్ లోని హాలియన్ కౌంటీలో ఓ ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిసి విన్యాసాలు చేపట్టింది. అనంతరం మరో ఆరు ఎఫ్-16వి విమానాలు గాల్లోకి ఎగిశాయి. చైనా బెదిరింపుల పట్ల తాము అప్రమత్తంగానే ఉన్నామని ఈ విన్యాసాల ద్వారా తైవాన్ చాటిచెప్పే ప్రయత్నం చేసింది. 

చైనాతో ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తున్న తైవాన్ గత కొంతకాలంగా వాయుసేనను ఆధునికీకరిస్తోంది. కాలం చెల్లిన యుద్ధ విమానాల స్థానంలో కొత్త యుద్ధ విమానాలను సమీకరిస్తోంది. గతేడాది నవంబరులో అమెరికా తయారీ ఎఫ్-16వి యుద్ధ విమానాల స్క్వాడ్రన్ ను తొలిసారిగా మోహరించింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎఫ్-16 ఫైటర్ జెట్లకు అత్యాధునిక రూపమే ఎఫ్-16వి.


More Telugu News