నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ ఎనిమిది ఆహార పదార్థాలతో ఉపశమనం ఉంటుందంటున్న నిపుణులు

  • పెరుగు, తులసి, గ్రీన్ టీ, బ్లాక్ టీలతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చని వెల్లడి
  • అల్లం, నిమ్మ జాతి పండ్లతోనూ ప్రయోజనమని వివరణ
  • పలు రకాల అనారోగ్యాలతోనూ నోటి దుర్వాసన ఉంటుందని, వాటికి చికిత్స అవసరమని సూచన
ఇటీవలి కాలంలో ఫాస్ట్ ఫుడ్ నుంచి కూల్ డ్రింక్ ల దాకా చాలా రకాల ఆహార పదార్థాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా చిప్స్ వంటి జంక్ ఫుడ్ కారణంగా నోరు, దంతాల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దానికితోడు అపరిశుభ్రత కారణంగా.. నోటి దుర్వాసనకు దారి తీస్తోంది. ఎవరి దగ్గరికైనా వెళ్లినప్పుడు ఇది తీవ్రంగా ఇబ్బందిపడేందుకు కారణమవుతోంది. 

అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు దంతాల ఆరోగ్యానికి, దుర్వాసన పోగొట్టడానికి వీలు కల్పిస్తాయి. పోషకాహారం ఎక్కువగా ఉండే ఈ ఆహార పదార్థాలతో అటు శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని.. ఇటు నోటి ఆరోగ్యానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 8 రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

1. పెరుగు
పెరుగు చాలా రకాలుగా మన నోటి దుర్వాసనను అరికట్టడానికి తోడ్పడుతుంది. ఇందులోని విటమిన్‌ డి దంతాల ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది. ఇది శరీరంలో సూక్ష్మజీవుల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పెరుగు వల్ల మన జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఇది గ్యాస్‌ సమస్యను తగ్గించి నోటి నుంచి వాసన వచ్చే పరిస్థితిని నియంత్రిస్తుంది.

2. బాసిల్(తులసి)
తులసి, ఆ జాతికి సంబంధించిన ఇతర మొక్కల్లోని పాలీఫెనాల్స్‌ అనే సహజ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనను అరికట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇక ఇతర ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్‌ కూడా కొంత వరకు నోటి దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది.

3. గ్రీన్ టీ, బ్లాక్‌ టీ
గ్రీన్‌ టీలో, బ్లాక్‌ టీ (డికాక‌్షన్‌)లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ రసాయనాలు ఉంటాయి. ఇవి దంతాల ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ముఖ్యంగా వీటిలోని పాలిఫెనాల్స్‌ నోటిలో సల్ఫర్‌ సమ్మేళనాలను తగ్గించి దుర్వాసనను అరికడతాయి.

4. సిట్రస్ ఫ్రూట్స్
శరీరానికి ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి, వివిధ సమస్యలను తగ్గించే ప్రక్రియలకు విటమిన్‌ సి అత్యంత ఆవశ్యకం. ఇది నోటిలో చిగుళ్ల వాపు, పిప్పి పళ్లు, ఇతర సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందువల్ల నోటి దుర్వాసన తగ్గాలంటే నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయిలతోపాటు తర్బూజ, పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

5. అల్లం
అల్లంలో ఉండే 6-జింజరోల్‌ అనే రసాయన పదార్థం లాలాజలంలో ఎంజైమ్‌ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆ ఎంజైమ్‌ నోటిలో సల్ఫర్‌ సమ్మేళనాలను తొలగించి నోటి దుర్వాసనను పోగొడుతుంది. చిన్న అల్లం ముక్కను నేరుగా నమలడం ద్వారాగానీ, కొంచెం నిమ్మరసంలో అల్లం రసాన్ని కలుపుకొని మౌత్‌ వాష్‌ లా వినియోగించుకోవడం గానీ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

6. పార్స్‌ లీ (కొత్తిమీర జాతికి చెందిన ఆకు), దాల్చిన చెక్క, యాలకులు
నోటి దుర్వాసనకు పార్స్‌ లీ ఆకుల్లోని కొన్ని రకాల నూనెలు మంచి చికిత్సగా పనిచేస్తాయి. ఇక దాల్చిన చెక్క, పుదీనా, యాలకులు, యూకలిఫ్టస్‌, రోజ్‌ మేరీ, కొత్తిమీర వంటివి కూడా దుర్వాసనను తగ్గించడానికి తోడ్పడుతాయి.

7. చెర్రీలు
సాధారణంగా పండ్లలో చాలా రకాలు మన నోటి దుర్వాసనను అరికట్టేందుకు తోడ్పడినా.. చెర్రీలు మాత్రం అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నోటిలో కుళ్లిన వాసనకు కారణమయ్యే మిథైల్‌ మెర్కాప్టాన్‌ అనే రసాయనాన్ని చెర్రీల్లోని పదార్థాలు తొలగిస్తాయని వివరిస్తున్నారు. చెర్రీల్లో ఉండే ఫైబర్‌, విటమిన్‌ సి తోనూ ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. 

8. డార్క్ చాకోలెట్
సాధారణ చాకోలెట్‌ లో చక్కెర శాతం ఎక్కువ. అవి దంతాలకు హాని చేస్తాయి. అదే డార్క్‌ చాకోలెట్‌ మాత్రం నోటి దుర్వాసన తగ్గేందుకు తోడ్పడుతుంది. డార్క్‌ చాకోలెట్‌ లో ఉండే సీబీహెచ్‌ అనే రసాయనం దంతాలపై ఎనామిల్‌ పొరను బలోపేతం చేసి.. దంతాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది. అయితే డార్క్‌ చాకోలెట్‌ ను ప్రాసెస్‌ చేసి, చక్కెర కలిపి సాధారణ చాకోలెట్లుగా రూపొందించినప్పుడు సీబీహెచ్‌ రసాయనం తగ్గిపోతుంది.

మరెన్నో కారణాలూ ఉంటాయి
నోటి ఆరోగ్యం బాగోలేకపోవడానికి, దుర్వాసనకు చాలా రకాల కారణాలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంక్‌ ఫుడ్‌, పరిశుభ్రత సరిగా లేక తలెత్తిన దుర్వాసన సమస్యను ఆహారంలో మార్పుల ద్వారా నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు. కానీ కొన్ని రకాల అనారోగ్యాలు, దంతాలు, జీర్ణాశయ సమస్యల వల్ల తలెత్తే నోటి దుర్వాసన సమస్యకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.


More Telugu News