అరటి పండు మితంగానే.. లేదంటే దుష్ప్రభావాలు

  • రోజూ ఒక అరటి పండు సరిపోతుంది
  • గుండె ఆరోగ్యానికి మంచిది 
  • పరిమితి మించితే అజీర్ణం
  • బరువు పెరిగిపోయే సమస్య
అరటి పండ్లను ఎక్కువ మంది ఇష్టపడతారు. చాలా తక్కువ ధరకు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పండ్లుగా అరటి, జామ అని నిస్సందేహంగా చెప్పుకోవాలి. అరటి పండ్లలో ఉండే పొటాషియం, విటమిన్లు, పీచు మనకు ఎంతో మేలు చేస్తాయి. తక్షణం శక్తినిచ్చే పండు ఇది. గుండె ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది. ఇదంతా మితంగా తిన్నప్పుడేనట. పరిమితి దాటితే బరువు పెరగడం సహా ఎన్నో సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు. మితంగా అంటే ఎన్ని..? ఒక్కటి సరిపోతుంది. అది కూడా పూర్తిగా పండినదే తినాలి. మరీ చిన్నవి అయితే రెండు తినొచ్చు.

అజీర్ణం
అరటి పండ్లలో పీచు ఉంటుంది. అదే సమయంలో కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే తక్షణ శక్తి లభిస్తుంది. పీచు ఉన్నందున ఎక్కువగా తింటే జీర్ణం అవ్వడానికి అధిక సమయం తీసుకుంటుంది. పేగుల్లోని నీటిని అరటి పండులోని ఫైబర్ పెక్టిన్ అధికంగా తీసుకుంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాదు, అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురు కావచ్చు. 

పోషకాల సమతుల్యత
మన శరీర జీవక్రియలకు పోషకాల సమతుల్యత ఎంతో అవసరం. కానీ, అరటి పండ్లు అన్నవి ఘనాహారం కిందకు వస్తాయి. దీంతో వీటిని కడుపునిండా తింటే, జీర్ణాశయంలో ఇతర ఆహారానికి ఖాళీ మిగలదు. దీనివల్ల పోషకాల సమతుల్యత లోపిస్తుంది. 

బరువు పెరగడం
బరువు పెరగాలనుకునే వారికి అరటి పండుతో మంచి ప్రయోజనాలు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉన్నందున అధిక బరువు సమస్య ఏర్పడవచ్చు. రోజూ ఒకటికి మంచి ఎక్కువ తినడం, తిన్న తర్వాత నిద్రించడం చేస్తే గట్టిగా 15-30 రోజుల్లోనే శరీర బరువు పెరిగిపోతుంది. 

మగత, బద్ధకం 
అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్ర పోవడానికి సాయపడే అమైనో యాసిడ్. మోస్తరు కంటే ఎక్కువ అరటి తీసుకోవడం వల్ల దీని  కారణంగా సెరటోనిన్ ఉత్పత్తి పెరిగిపోతుంది. దాంతో నిద్ర మత్తుగా, బద్ధకంగా అనిపిస్తుంది.

పంటి సమస్యలు
అరటి పండు తిన్న తర్వాత బ్రష్ చేసుకోవడం మంచి అలవాటు.  ఎందుకంటే చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కనుక అవి పండ్లలో ఇరుక్కుంటాయి. చిగుళ్ల సమస్యలు, దంతాలు పుచ్చేందుకు కారణమవుతాయి.


More Telugu News