మళ్లీ పోటెత్తుతున్న గోదావరి... భద్రాచలం వద్ద ఉగ్రరూపం

  • ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి
  • భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
  • జల దిగ్బంధంలో పలు మండలాలు
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి భయంకరంగా ఉంది. నీటి మట్టం 54.5 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు గోదావరి వరదతో పలు మండలాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పలు గ్రామాలు నీటమునిగాయి. 

కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 12.140 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో అక్కడ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10,07,540 క్యూసెక్కులుగా ఉంది. 

రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా వరద పోటెత్తుతోంది. బ్యారేజీ నీటి మట్టం 14.80 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14.35 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


More Telugu News