ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై బాదుడు మొదలెట్టిన బ్యాంకులు!

  • సొంత బ్యాంకు ఏటీఎం నుంచి ఐదుసార్లు, ఇతర బ్యాంకుల నుంచి మూడు లావాదేవీలు మాత్రమే ఉచితం
  • ఆపై అన్ని ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలపై చార్జీ వసూలు
  • ఆర్థిక లావాదేవీకి రూ. 17, ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 చొప్పున ఇంటర్‌చేంజ్ రుసుము 
ఏటీఎం కనిపించింది కదా అని వందకు, ఐదొందలకు కార్డు పెట్టి లాగేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఉచిత లావాదేవీలను పరిమితం చేస్తూ, ఆపై చేసే ప్రతి లావాదేవీకి చార్జీలు వసూలు చేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు నిర్ణయించాయి. పరిమితి దాటిన తర్వాత ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలను విధించనున్నాయి. 

ఖాతా రకం, డెబిట్ కార్డుల ఆధారంగా ఏటీఎంలో ఉచిత లావాదేవీల సంఖ్య విషయంలో మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల అనుమతించిన వాటికి మించి జరిపే లావాదేవీలపై ఖాతాదారులు చార్జీలు చెల్లించకతప్పదు. నిజానికి ఇందుకు సంబంధించి గతేడాది జూన్‌లోనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటీఎంలో ఉచిత లావాదేవీలు పరిమితికి మించితే ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ. 21 చార్జ్ వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. గతంలో ఈ చార్జ్ రూ. 20గా ఉండేది. 

ఖాతాదారులు ప్రతి నెల తమ బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీపైనా బాదుడు తప్పదు.

ఇదిలా ఉండగా, ఆగస్టు 1 నుంచి ఆర్థిక లావాదేవీకి రూ. 17, ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 చొప్పున ఇంటర్‌చేంజ్ రుసుమును విధించుకునేందుకు అన్ని బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. మరిన్ని ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, వాటి నిర్వహణ కోసమే బ్యాంకులు ఈ సర్వీసు చార్జీలను ఉపయోగిస్తాయి. అలాగే, అన్ని మేజర్ బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక ఫీజును కూడా వసూలు చేస్తున్నాయి.


More Telugu News