మద్రాస్ హైకోర్టులో హీరో విజయ్ కు స్వల్ప ఊరట

  • విజయ్ కు రూ. 1.50 కోట్ల జరిమానా విధించిన ఐటీ శాఖ
  • 'పులి' చిత్రం రెమ్యునరేషన్ ను ఐటీ లెక్కల్లో చూపించలేదని ఆరోపణ
  • ఐటీ ఉత్తర్వులపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు 
తమిళ స్టార్ హీరో విజయ్ కు మద్రాసు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు ఐటీ శాఖ రూ. 1.50 కోట్ల జరిమానా విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... 'పులి' చిత్రం ద్వారా లభించిన రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ ను దాచిపెట్టి 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ ను విజయ్ దాఖలు చేశారనే కారణంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించింది. 

గతంలో విజయ్ నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అప్పుడు లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా రెమ్యునరేషన్ ను ఐటీ లెక్కల్లో విజయ్ చూపించలేదని అధికారులు గుర్తించారు. దీంతో, ఆయనకు జరిమానా విధించారు. ఐటీ శాఖ జరిమానా విధించడాన్ని విజయ్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తాను రిటర్నులు సమర్పించిన ఆర్థిక సంవత్సరంలోనే ఐటీ అధికారులు జరిమానా విధించి ఉండాల్సిందని... ఆలస్యంగా విధించిన జరిమానా చెల్లుబాటు కాదని కోర్టుకు ఆయన విన్నవించారు. వాదనలను విన్న హైకోర్టు ఐటీ శాఖ ఉత్తర్వులపై స్టే విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.


More Telugu News